
పచ్చడి తయారీకి కుండలు పరిశీలిస్తున్న దృశ్యం
● షడ్రుచుల పచ్చడి.. పండుగ ప్రత్యేకం● ఆలయాల్లో పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు ● నేడు శ్రీ శోభకృత్ నామ సంవత్సర వేడుకలు
ఖమ్మంగాంధీచౌక్: తెలుగు ప్రజల తొలి పండుగ ఉగాది. ఉగాది అనే పదం యుగాది నుండి రాగా.. బుధవారం చైత్రశుద్ద పాఢ్యమిగా కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. నూతన ఉత్సాహాలకు నాందిగా పండుగ జరుపుకోనుండగా.. ఈ ఏడాదిని శ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా వ్యవహరిస్తారు. కాగా, జిల్లా ప్రజలు సంప్రదాయ పద్ధతుల్లో శ్రీ శోభకృత్ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉగాది వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆలయాల్లో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేయగా.. అర్చకులు పంచాంగ పఠనం చేయనునన్నారు. అలాగే, రానున్న శ్రీ రామ నవమిని పురస్కరించుకుని వేడుకలు బుధవారమే మొదలుకానున్నాయి.
నూతన పనులు ప్రారంభం
ఉగాది రోజుల కొత్త పనులను ప్రారంభించడం ఆనవాయితీ. ప్రధానంగా గ్రామాల్లో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. పశువులను అలంకరించి వ్యవసాయ భూముల్లోకి సేంద్రియ ఎరువులు తోలడం ఆరంభిస్తారు. అలాగే, వ్యాపార సంస్థలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంకా ఇళ్లలో లక్ష్మీదేవికి దీపారాధన, గో పూజ, గోప్రదక్షణ చేస్తారు.
ఉగాది పచ్చడి ప్రత్యేకం
ఉగాది వసంత రుతువు ఆగమనం ప్రారంభమైన రోజు. ఈ రోజు షడ్రుచులు కలిపిన పచ్చడి తయారు చేసి తినడం ఆనవాయితీ. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు రుచులతో ఉండే ఈ పచ్చడి తయారీ కోసం మామిడికాయలు, కొత్త చింతపండుగ ఇతరత్రా సామగ్రితో పాటు కొత్త కుండలు అమ్మకాలు జోరుగా సాగాయి.
పంచాంగ పఠనానికి ప్రాధాన్యత
ఆలయాల్లో పండితులు వినిపించే పంచాంగ పఠనానికి ప్రజలు ప్రాధాన్యతను ఇస్తారు. ఈ ఏడాది ఆదాయ, వ్యయాలు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చనుండగా.. రైతులు కాలం తీరు, పంటల సాగు వివరాలు తెలుసుకుంటారు.
పంచాంగ శ్రవణం ప్రత్యేకం
ఉగాది రోజున పంచాంగం శ్రవణం, పఠనానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవాలయాలు, కళాక్షేత్రాల్లో పంచాంగ పఠనం సందర్భంగా నూతన సంవత్సరం ఏయే రంగాలకు అనుకూలం, ఏయే రంగాలకు ప్రతికూలం, ఏ పంటల సాగు చేసుకోవాలి, వర్షాలు ఎలా ఉంటాయో పండితులు వివరిస్తారు. – ఆమంచి సురేష్ శర్మ, అర్చకులు
భవిష్యవాణిని తెలిపేదే పంచాగం
పంచాంగం భవిష్యవాణిని తెలుపుతుంది. ఈ పంచాంగం ద్వారా దినాధిపతులు, తారాబ లం తెలుసుకోవచ్చు. రానున్న ఏడాది సంభవించే పరిణామాలు కూడా వివరించబడుతాయి. వర్షాలు, పంటలు, కాలంతో పాటు వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యాపారం తదితర అంశాలను పంచాంగం ద్వారా వివరిస్తారు. – మార్త వీరభద్ర ప్రసాద్‌శర్మ,
స్తంభాద్రి పౌరోహిత సంఘం అధ్యక్షుడు

ఖమ్మంలో పూలు, మామిడాకులు కొనుగోలు చేస్తున్న ప్రజలు

