
ఏన్కూరులో జనచైతన్యయాత్రకు స్వాగతం పలుకుతున్న దృశ్యం
● బీజేపీ పాలనలో కార్పొరేట్లకు మేలు ● హామీలు నెరవేర్చకపోతే కేసీఆర్‌పైనా పోరాడుతాం.. ● జనచైతన్య యాత్రలో తమ్మినేని వీరభద్రం
ఏన్కూరు/తల్లాడ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యాన చేపట్టిన జనచైతన్య యాత్ర మంగళవారం సాయంత్రం జిల్లాకు చేరుకోగా.. ఏన్కూరు, తల్లాడలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. కులాలు, మతాల వారీగా ప్రజలను రొచ్చగొడుతూ బీజేపీ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన గాంధీని హత్య చేసిన గాడ్సేకు మద్దతు ఇస్తూ.. రాజ్యాంగం రాసిన అంబేద్కర్‌ను మాత్రం కించపరుస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు, నల్లధనం పంపిణీ.. ఇలా అన్ని అంశాల్లోనూ మోదీ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. బీజేపీని వ్యతిరేకించే వారిని కేంద్ర దర్యాప్తు సంస్థల్లో వేధిస్తున్నారని.. సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై నమోదు చేసిన కేసు కూడా అలాంటిదేనని చెప్పారు. ఏదిఏమైనా బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేసి రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని వీరభద్రం వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో 11 లక్షల మంది పోడుసాగుదారులకు పట్టాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే సీఎం కేసీఆర్‌పై కూడా పోరాటానికి సిద్ధమని తెలిపారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్న కొందరు నేతలు ఆ పార్టీ విషనాగు అని తెలుసుకోవాలని హితవు పలికారు. కాగా, సీపీఎం, సీపీఐ పార్టీలు జిల్లాలో కలిసి పనిచేసేలా చర్చలు జరిగాయని.. సీట్ల విషయంలోనూ ఇబ్బంది లేదని వీరభద్రం వెల్లడించారు. తల్లాడలో జరిగిన సభకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరై సంఘీబావం ప్రకటించి మాట్లాడారు. ఈ యాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడగు భాస్కర్, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావుతో పాటు నాయకులు భూక్యా వీరభద్రం, బొంతు రాంబాబు, ఐనాల రామలింగేశ్వరరావు, డి.నాగేశ్వరావు, బానోతు బాలాజీ, ఏర్పుల రాములు, ఇటికాల లెనిన్, మాచర్ల భారతి, నాగరాజు, తాతా భాస్కర్‌రావు, శీలం సత్యనారాయణరెడ్డి, శీలం ఫకీరమ్మ పాల్గొన్నారు.