సినిమా తరహాలో ఛేజింగ్‌

స్వాధీనం చేసుకున్న గంజాయి, నిందితులతో పోలీసులు
 - Sakshi

● గంజాయి స్మగ్లర్లను వెంటాడి బంధించిన పోలీసులు ● రూ.30లక్షల సరుకు స్వాధీనం, నలుగురి అరెస్ట్‌

కూసుమంచి: ఒడిశా నుంచి ఖమ్మం మీదుగా కర్ణాటకకు నలుగురు వ్యక్తులు రెండు కార్లలో గంజాయి తరలిస్తుండగా సినీ ఫక్కీలో చేజింగ్‌ చేసిన టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వివరాలను కూసుమంచి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కూసుమంచి సీఐ కంది జితేందర్‌రెడ్డి, స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ లతీఫ్‌ వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరికి చెందిన అరుణ్‌మండల్‌, సాథన్‌ జోధ్వా, మణింద్ర బాబీ, గోవిందు అల్తార్‌ రెండు కార్లలో రూ.30.60లక్షల విలువైన 153 కిలోల గంజాయి తీసుకుని కర్ణాటక బయలుదేరారు. ఖమ్మం, హైదరాబాద్‌ మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు, బెంగళూరు వెళ్లి గంజాయి అమ్మేందుకు వెళ్తున్నారు. ఈమేరకు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి మంగళవారం నాలుగు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. అయితే, దుండగులు అప్పటికే ఖమ్మం దాటగా.. కూసుమంచి మండలం పాలేరు చెక్‌ పోస్ట్‌ వద్ద నిఘా వేయగా.. గుర్తించిన గంజాయి రవాణాదారులు తమ కార్లను వెనక్కి తిప్పారు. దీంతో పోలీసులు వారిని కిలోమీటర్‌ దూరం మేర వెంబడించారు. ఈక్రమంలో పాలేరు పెట్రోల్‌ బంక్‌ వద్ద ఓ వాహనాన్ని పోలీసులు చుట్టుముట్టడంతో ఆపారు. మరో కారు ఆగినట్లుగా ఆగి మళ్లీ వెళ్తుండడంతో అక్కడే ఉన్న రఘునాథపాలెం ఎస్సై రవి కారు స్టీరింగ్‌ కదలకుండా గట్టిగా పట్టుకున్నా డ్రైవర్‌ ముందుకు పోనిచ్చారు. దీంతో ఎస్సైను కారు ఈడ్చుకువెళ్తూ సూచిక బోర్డు ఢీకొట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. దీంతో మిగతా పోలీసులు అప్రమత్తమై ఆ కారుతో పాటు నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ సర్వేశ్వరరావు, ఎస్‌టీఎఫ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎకై ్స, పోలీసు ఎస్సైలు మురళి, ముబాసిన్‌ అహ్మద్‌, శంకర్‌, ఏఎస్సై కృష్ణప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, అటు గంజాయి రవాణాదారులు, ఇటు పోలీసుల వాహనాలు వేగంగా రహదారిపై వెళ్తుండడంతో ఏం జరుగుతుందో తెలియక మిగతా వాహనదారులు ఆందోళనకు గురయ్యారు.

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top