
విద్యుత్ కాంతులతో వెలుగొందుతున్న రామాలయం
భద్రాచలం: భద్రగిరిలో బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అలాగే ఈనెల 31 వరకు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక ప్రయుక్త ద్వాదశ కుండాత్మక చతుర్వేద హవనం, శ్రీరామయణ మహాక్రతువు నిర్వహించనున్నారు. 30, 31 తేదీల్లో శ్రీసీతారాముల కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది పుష్కర పట్టాభిషేకం సందర్భంగా యాగశాలలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజాది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
నేడు ఉగాది వేడుకలు..
శోభకృత్ నామ సంవత్సరాది(ఉగాది)ని పురస్కరించుకుని గర్భాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. వేప పూత పచ్చడిని నివేదన చేసి భక్తులకు పంచుతారు. ఉదయం 7 గంటలకు మూలవరులకు ప్రత్యేక అభిషేకం (తిరుమంజనం) నిర్వహిస్తారు. ప్రతీ ఆదివారం మాత్రమే జరిగే ఈ అభిషేకం ఏడాదిలో ఐదు ప్రత్యేక రోజుల్లోనూ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, శ్రీరామనవమి, వైశాఖ పునర్వసు, నరక చతుర్దశి, వైకుంఠ ఏకాదశి రోజుల్లో ప్రత్యేకంగా అలకరించి అభిషేకం చేస్తుంటారు. సాయంత్రం ఆస్థాన పురోహితులచే పంచాంగ శ్రవణం ఉంటుంది.
29 వరకు ప్రత్యేక పూజలు..
శ్రీ రామాయణ క్రతువుకు శ్రీకారం చుట్టి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. బుధవారం అంకురార్పణ అనంతరం 29వ తేదీ వరకు యాగశాలలో, ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. 23 నుంచి 29వ తేదీ వరకు ఉదయం 7 గంటలకు తిరువారాధన, సేవాకాలం, తీర్థ ఘోష్ఠి, 8.30 గంటలకు రామాయణ మహాక్రతువులో భాగంగా చుతుర్వేద, రామాయణ, రామషడాక్షరీ, నారాయణ అష్టాక్షరీ మంత్ర హోమాలు, 11 గంటలకు సంక్షేప రామాయణ సామూహిక పారాయణం, 11.30 గంటలకు నిత్య పూర్ణాహుతి, ప్రసాద వినియోగం, సాయంత్రం 5.30 గంటలకు శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర సామూహిక పారాయణం, 6 గంటలకు రామాయణ మహా క్రతువు హోమాలు, 7 గంటలకు వేదిక వద్ద రామాయణ ప్రవచనం, రాత్రి 8 గంటలకు నిత్య పూర్ణాహుతి, ప్రసాద వియోగం తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 5 వరకు నిత్యకల్యాణాలు రద్దు..
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బుధవారం నుంచి ఏప్రిల్ 5 వరకు స్వామివారి నిత్యకల్యాణ వేడుకను, ఈనెల 26 నుంచి ఏప్రిల్ 5 వరకు దర్బారు సేవలను రద్దు చేశారు. 26 నుంచి ఏప్రిల్ 11 వరకు పవళింపు సేవలను కూడా నిలిపివేయనున్నారు. ఈనెల 30న శ్రీరామ పునర్వసు దీక్ష, ఏప్రిల్ 12న నూతన పర్యంకోత్సవం, ఏప్రిల్ 27న శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ, ఏప్రిల్ 28న పట్టాభిషేకం జరగనున్నాయి.
బ్రహ్మోత్సవ శోభ సంతరించుకున్న భద్రగిరి
నేడు ఆలయంలో పుష్కర
పట్టాభిషేకానికి అంకురార్పణ
యాగశాలలో రామాయణ క్రతువుకు ఏర్పాట్లు
నేటి నుంచి ఏప్రిల్ 5 వరకు నిత్యకల్యాణాలు రద్దు
నేటి పూజా కార్యక్రమాలిలా...
పుష్కర పట్టాభిషేక ఉత్సవాలకు ఆలయం వద్ద నిర్మించిన ప్రత్యేక యాగశాలలో బుధవారం అంకురార్పణ చేస్తారు. ఉదయం ఏడు గంటలకు మూలమూర్తుల సన్నిధిలో ఉత్సవ అనుజ్ఞ తీసుకుంటారు. 7.30 గంటలకు ఓంకార ధ్వజారోహణంఎనిమిది గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, రక్షాబంధనం, చిత్రకూట మండపంలో వాస్తు హోమాలు, 11.30 గంటలకు పుష్కర యాగశాలలో పర్యగ్నికరణం, యాగశాల ప్రవేశము, దేవాలయ ప్రాంగణములో సంక్షేప రామాయణ హవనం నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు ఆలయంలో దర్బార్ సేవ, ఆరు గంటలకు ఆస్థాన పండితులచే పంచాంగ శ్రవణం, రాత్రి ఏడు గంటలకు యాగశాల వద్ద శ్రీ రామాయణ క్రతువు, ఎనిమిది గంటలకు అంకురార్పణ, ప్రసాద వినియోగం కార్యక్రమాలు జరుగుతాయి.

హోమగుండం సిద్ధం చేస్తున్న భక్తులు