
ఖమ్మం మార్కెట్‌కు విక్రయానికి తీసుకొచ్చిన మిర్చి
ఖమ్మంవ్యవసాయం: ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చికి నిజంగానే బంగారం మాదిరి ధర పెరుగుతోంది. తేజా రకం మిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట ధర నమోదైంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షాన సోమవారం ఖమ్మం మార్కెట్‌లో మిర్చి జెండాపాట నిర్వహించగా క్వింటాకు రూ.25,550 ధర పలికింది. తేజా రకం మిర్చిని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తుండగా.. జిల్లా రైతులతో పాటు వరంగల్, నల్లగొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి రైతులు ఇక్కడకు తీసుకొస్తారు. అయితే, ఈసారి సాగు తగ్గడంతో పాటు దిగుబడి పడిపోగా.. విదేశాల నుంచి స్థానిక వ్యాపారులకు ఆర్డర్లు ఉండడంతో మిర్చికి డిమాండ్ పెరిగింది. గతంలో అన్‌సీజన్‌లో నిల్వ మిర్చికి రూ.20వేలకు పైగా ధర పలకగా.. ఈసారి సీజన్‌లోనే రూ.25,500 నమోదు కావడం విశేషం. గత శుక్రవారం రూ.23వేలు పలికిన ధర రెండు రోజుల వ్యవధిలో రూ.2,550 పెరిగింది. మార్కెట్‌కు 23,809 బసాల మిర్చి రాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరుకు చెందిన రైతు అచ్చా శ్రీను తీసుకొచ్చిన 90 బస్తాలకు అత్యధిక ధర లభించింది. ఇక మోడల్ ధర రూ.23 వేలు, కనిష్ట ధర రూ.17 వేలుగా పలికింది. ఈ సందర్భంగా అచ్చా శ్రీనును మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మార్కెట్ చైర్‌పర్సన్ దోరేపల్లి శ్వేత, వైస్ చైర్మన్ షేక్ అఫ్జల్ సన్మానించారు.
ఖమ్మం మిర్చికి విదేశాల్లో డిమాండ్
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో విక్రయానికి వచ్చే తేజా రకం మిర్చికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలి పారు. నాణ్యమైన మిర్చి కావడంతో తేజా రకానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పలికిందని, ఖమ్మం మార్కెట్‌ను ఎర్రబంగారానికి చిరునామాగా గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కృషి జరుగుతోందని తెలి పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్షి మల్లేశం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కె.నాగరాజు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావుతో పాటు వ్యాపార ప్రతినిధులు జీ.వై.నరేష్, మన్నెం కృష్ణ, మాటేటి నాగేశ్వరరావు, ఎడ్లపల్లి సతీష్, దిరిశాల చిన్న వెంకటేవ్వర్లు, ముత్యం ఉప్పల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం మార్కెట్‌లో ‘తేజ’ మిర్చి రికార్డ్
క్వింటాకు రూ.25,550గా ధర నమోదు
కొనుగోళ్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి పువ్వాడ

మార్కెట్‌లో కొనుగోళ్లను పరిశీలిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్, చైర్‌పర్సన్ శ్వేత