
● ఏళ్ల తరబడి సగం మంది ఉద్యోగులే విధులు ● ఆర్టీసీ నుంచి డ్రైవర్లు.. పోలీసు శాఖ నుంచి హోంగార్డులు ● వేసవిలో పెరగనున్న ప్రమాదాలతో ఆందోళన
జిల్లా అగ్నిమాపక శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏళ్ల తరబడి సగం మంది ఉద్యోగులే విధులు నిర్వర్తిస్తుండడంతో వారిపై అదనపు భారం పడుతోంది. వేసవి కాలంలో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియదని, పూర్తి స్థాయిలో సిబ్బంది లేకుంటే ఈ గండాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదని ఉన్న ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు. – ఖమ్మంక్రైం
ఐదు స్టేషన్లలోనూ సగం మందే..
జిల్లాలో ఐదు అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఖమ్మం, వైరా, మధిర, కూసుమంచి, సత్తుపల్లిలో ఫైర్ స్టేషన్లతో పాటు నేలకొండపల్లిలో ఔట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఐదు ఫైర్ స్టేషన్లలోనూ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలో మొత్తం 50 మంది ఫైర్ మెన్‌లు అవసరం కాగా, చాలా కాలంగా 25 మంది మాత్రమే పనిచేస్తున్నారు. లీడింగ్ ఫైర్‌మెన్‌లు మాత్రం 10కి 10 మంది ఉన్నారు.
నేలకొండపల్లి ‘ఔట్’ పోస్ట్..
జిల్లాలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకునే మండలాల్లో ముఖ్యమైన నేలకొండపల్లిలోని ఔట్ పోస్ట్ నుంచి ఫైర్ ఇంజన్‌ను ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్‌కు తరలించడంతో అక్కడ ఫైర్ ఇంజన్ కొరత ఏర్పడింది. నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో వేసవి కాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. మంటలు ఆర్పడానికి ఖమ్మం నుంచి ఫైర్ ఇంజన్‌లు వచ్చేసరికి భారీ నష్టం వాటిల్లుతుంది. గతంలో నేలకొండపల్లి ఔట్ పోస్ట్‌లో ఫైర్ ఇంజన్ ఉండడంతో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వెళ్లి మంటలను ఆర్పి ఆస్తి నష్టం జరగకుండా చూసేవారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నేలకొండపల్లిలో ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.
ఖమ్మంలో కార్యాలయాలు కరువు..
జిల్లా కేంద్రమైన ఖమ్మంలో అగ్నిమాపక శాఖకు సంబంధించి కార్యాలయాలు కరువయ్యాయి. ఎన్నెస్పీ క్యాంప్‌లో చాలా కాలం క్రితం అగ్నిమాపక శాఖకు స్థలం కేటాయించినా ఇంతవరకు భవన నిర్మాణం చేపట్టలేదు. దీంతో శిథిలావస్థకు చెందిన క్వార్టర్లలోనే కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి కార్యాలయం ఏళ్ల తరబడి అద్దె భవంలోనే ఉంటోంది.
రూ.3కోట్లకు పైగా ఆస్తి నష్టం
జిల్లాలో 2022 నుంచి గత ఫిబ్రవరి వరకు జరిగిన అగ్ని ప్రమాదాల్లో రూ.3 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిప్రమాద ఘటనలపై సమాచారం అందించేందుకు 396 మంది ఫోన్‌లు చేశారు.
వేసవిలో ప్రమాదాలకు ఆస్కారం..
ఈసారి వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో అగ్ని ప్రమాదాల సంఖ్య భారీగా పెరగవచ్చని పలువురు భయపడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉండడంతో అగ్నిమాపక శాఖ ముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అగ్ని ప్రమాదాలను అరికట్టడం, ఒకవేళ జరిగితే తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.
ఆర్టీసీ డ్రైవర్లే దిక్కు..
ఫైర్ శాఖలో అతి ముఖ్యమైన డ్రైవర్ల పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. 15 మంది డ్రైవర్లు ఉండాల్సింది కేవలం ఐదుగురు మాత్రమే పనిచేస్తుండడం గమనార్హం. దీంతో ఆర్టీసీ డ్రైవర్లను తీసుకొచ్చి ఫైర్ ఇంజన్‌లు నడిపిస్తున్నారు. ఇక సిబ్బంది కొరత సమస్యను కొంతమేరైనా అధిగమించేందుకు పోలీస్ శాఖ నుంచి హోంగార్డుల సేవలను వినియోగించుకుంటున్నారు. వీరందిరికీ అగ్నిమాపక శాఖ నుంచే వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎంతో కీలకమైన డ్రైవర్ల కొరత అగ్నిమాపక శాఖను ఇబ్బందులకు గురిచేస్తోంది. నేరుగా అగ్నిమాపక శాఖ నుంచి వచ్చేవారికి ప్రత్యేక తర్ఫీదు ఉంటుంది. ఆర్టీసీ డ్రైవర్లకు మంటలు ఆర్పడం, ఘటనా స్థలాలకు త్వరగా చేరుకోవడం తదితర అంశాలపై అంతగా అవగాహన ఉండదని తెలుస్తోంది.
రూ.15కోట్ల విలువైన ఆస్తులను కాపాడాం
2022 నుంచి ఇప్పటివరకు రూ.15కోట్లకు పైగా విలువైన ఆస్తులను అగ్ని ప్రమాదాల బారి నుంచి కాపాడాం. మా శాఖలో నెలకొన్న సిబ్బంది సమస్యను అధిగమించేందుకు త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తాం. ఖమ్మంలో అగ్నిమాపక శాఖ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పోలీస్ హౌసింగ్ బోర్డు వారు త్వరలోనే ఈ భవనాన్ని నిర్మిస్తారు. – జయప్రకాష్,
ఉమ్మడి జిల్లా అగ్నిమాపకశాఖాధికారి

ఖమ్మంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం

అగ్నిమాపక వాహనాలు