
చికిత్స పొందుతున్న బాబూరావు
కూసుమంచి: గ్రామంలోని విద్యుత్ స్తంభం విరిగిపడి గ్రామీణ వైద్యుడికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం రాత్రి మండలంలోని చేగొమ్మ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు ఉన్నం బాబూరావు తన ఇంటి ముందు వీధిలో నిల్చున్నాడు. అదే సమయంలో సమీపంలోని ఓ వ్యక్తి చెట్టును నరకుతుండగా చెట్టు విరిగి వీధిలోని విద్యుత్ స్తంభంపై పడింది. ఆ స్తంభం విరిగి పక్కనే ఉన్న బాబూరావుపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని హుటాహుటిన ఖమ్మం తరలించారు. బాబూరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
యువతి అదృశ్యం
చింతకాని: మండలంలోని కోమట్లగూడెం గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతి అదృశ్యమైనట్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. సదరు యువతి ఈ నెల 18న తన స్నేహితుల గ్రామమైన వెంకటాయపాలెం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లింది. స్నేహితుల గ్రామం వెళ్లిన యువతి ఆచూకీ తెలియకపోవటంతో ఆమె తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పొదిల వెంకన్న కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
లోన్ యాప్ మాయ
● యువకుడి ఖాతా నుంచి రూ.30,500 మాయం
కారేపల్లి: మొబైల్ లోన్ యాప్ మాయాజాలానికి ఓ యువకుడు బలయ్యాడు. రూ.30,500 తన ఖాతా నుంచి మాయం కావటంతో.. ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ పుష్పాల రామారావు కథనం ప్రకారం.. భారత్‌నగర్ కాలనీకి చెందిన మద్దెల సాయి తన అవసరాల నిమిత్తం ప్రైవేట్ యాప్‌లో గత జనవరి 8వ తేదీన రూ.5 వేలు లోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత జనవరి చివరిలో తన ఖాతా నుంచి అదే మొబైల్ లోన్ యాప్‌లో రూ.5 వేలు చెల్లించాడు. ఈ క్రమంలో తన ఖాతాలో మిగిలి ఉన్న రూ.25,500 పైకం సైతం మాయమైపోయాయి. దీంతో సాయి ప్రైవేట్ లోన్ యాప్ ప్రతినిధులను సంప్రదించే ప్రయత్నం చేయగా ఎలాంటి స్పందన లేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసును కారేపల్లి పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామారావు తెలిపారు.
అధికారులు
మందలించారని..
● మనస్తాపంతో ఔట్‌సోర్సింగ్ వర్కర్ ఆత్మహత్యాయత్నం
ఖమ్మంమయూరిసెంటర్: అధికారులు మందలించారనే మనస్తాపంతో కేఎంసీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న స్వీపర్ నాగరాణి గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బంధువులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా నాగరాణి మీడియాతో మాట్లాడుతూ.. తాను ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నానని జవాన్ జ్యోతి అసిస్టెంట్ కమిషనర్ దగ్గరకు పిలిపించిందని, డబ్బులు తీసుకున్నానని, తిరిగి ఇప్పిస్తానని చెప్పినా వినకుండా తనను తిట్టారని, దీంతో మనస్తాపానికి గురైనట్లు తెలిపింది. ఇక, నాగరాణి డబ్బులు తీసుకొని జవాన్‌కే ఇచ్చిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. దీనిపై కమిషనర్ ఆదర్శ్ సురభిని వివరణ కోరగా ఘటన తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
పిడుగుపాట్లకు..
పశువులు బలి
వేర్వేరు గ్రామాల్లో 13 దుక్కిటెడ్లు మృతి
గుండాల: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం రాత్రి కురిసిన పిడుగుల వర్షానికి ఆళ్లపల్లి మండలంలోని వేర్వేరు గ్రామాల్లో 13 దుక్కిటెడ్లు మృత్యువాత పడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. ఆళ్లపల్లి మండలం సింగారం గ్రామానికి చెందిన పాయం లక్ష్మయ్యకు చెందిన మూడు దుక్కిటెడ్లు, తోలెం నర్సింహారావుకు చెందినవి రెండు, కొమరం రాంబాబుకు చెందినవి రెండు దుక్కిటెడ్లు పిడుగు పాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఇక నడిమిగూడెం పంచాయతీ సందిబంధం గ్రామానికి చెందిన బొమ్మల లక్ష్మయ్యకు చెందినవి మూడు, ఈసం సత్యం, బొమ్మల ఆంజనేయులు, అడవి రామారం గ్రామం పాయం పుల్లయ్యకు చెందిన ఒక్కో దుక్కిటెద్దు మృత్యువాత పడ్డాయి. ఒక్కో దుక్కిటెద్దు విలువ సుమారు రూ.50వేలు ఉంటుందని ప్రభుత్వం తమను నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.