ఆగని ఉపాధి వలసలు
సాక్షి బళ్లారి: ప్రభుత్వాలు మారుతున్నాయి. పాలకులు మారుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీకి చెందిన వారైనా నిరుద్యోగ సమస్యలను తీరుస్తామని, పరిశ్రమలను నెలకొల్పుతామని ఒకటే హామీ గుప్పిస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి కాలం వెళ్లదీస్తున్నారు. ఇది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అయితేనేమి రెండూ దొందూ దొందుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఉత్తర, కల్యాణ కర్ణాటక పరిధిలో ఉద్యోగాలు, ఉపాధి కోసం విద్యావంతుల నుంచి కూలీకార్మికుల వరకు నిత్యం వలసలు వెళ్లడం పరిపాటిగా మారింది. పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారే కానీ ఆ దిశగా పూర్తిగా హామీలను నెరవేర్చకపోవడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించడం సమస్యగా మారింది. ఒక వేళ ఆయా జిల్లాల్లో ఉన్న పరిశ్రమలు స్థానికేతరులకే ఎక్కువ అవకాశాలు కల్పిస్తుండటంతో ఈ ప్రాంత వాసులకు నిరుద్యోగ సమస్య రోజురోజుకు జటిలమవుతోంది.
బళ్లారి జిల్లాలో నెలకొన్న జిందాల్ సౌత్‌వెస్ట్(జేఎస్‌డబ్ల్యూ) స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతి పెద్ద ఉక్కు కర్మాగారం. దీంతో పాటు పలు చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఎన్నో ఉన్నాయి. నూతనంగా పరిశ్రమలను స్థాపించేందుకు వేలాది ఎకరాల భూసేకరణ కూడా జరిగింది. అయితే పరిశ్రమలు కనిపిస్తున్నాయే కానీ ఉపాధి లేకపోవడంతో వలసలు నిత్యం కృత్యమయ్యాయి. ఉత్తర కర్ణాటక పరిధిలోని కలబుర్గి, రాయచూరు, బెళగావి, కార్వార తదితర జిల్లాల్లో ఉపాధి అవకాశాలు లేక గోవా, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలసలు వెళుతుండటం కనిపిస్తోంది. బెళగావి జిల్లాలో దాదాపు వెయ్యికి పైగా చిన్న చిన్న పరిశ్రమలున్నాయి. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలున్నప్పటికీ వందలాది మంది యువకులు వలసలు వెళ్తున్నారు. కార్వార జిల్లా నుంచి సమీపంలోని గోవాకు వలసలు వెళ్లడం పరిపాటిగా మారింది. అక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేకపోవడంతో స్థానికులకు పెద్ద సమస్యగా మారింది.
బెళగావి జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీలు విస్తారంగా ఉన్నాయి. చెరుకు పండించే రైతులకు అవకాశాలున్నప్పటికీ కూలీలకు అంతంత మాత్రమే ఉపాధి దొరుకుతోంది. మహారాష్ట్ర సరిహద్దులోని విజయపుర జిల్లాలో కూడా ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ పరిశ్రమలను స్థాపించేందుకు తగినంత భూమి, నీరు, విద్యుత్ సౌకర్యాలున్నప్పటికీ పరిశ్రమలను స్థాపించకపోవడంతో నిత్యం పుణె, ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. కలబుర్గి జిల్లాలో సిమెంటు ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ ఎక్కువగా స్థానికేతరులకు ఉపాధి అవకాశాలు ఉండగా, స్థానికులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని, దీంతో తాము వలసలు వెళ్లక తప్పడం లేదని కలబుర్గి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీలు పెట్టేటప్పుడు స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారే కానీ అనంతరం చేతులు ఎత్తేయడంతో పాలకులు కూడా పట్టించుకోకపోవడంతో ఇతర ప్రాంతాలకు పొట్టకూటి కోసం వలసలు వెళ్తున్నట్లు వాపోతున్నారు.
పెట్టెబేడాతో వలస బాట పట్టిన విద్యావంతులు
మూటాముల్లె సర్దుకొని వలస వెళుతున్న కార్మికులు
సొంత ఊళ్ల నుంచి ఇతర చోట్లకు తరలుతున్న వైనం
ఉన్న పరిశ్రమల్లో స్థానికేతరులకే
ఎక్కువ అవకాశాలు
విద్యావంతులకూ దొరకని ఉపాధి
రాయచూరు జిల్లా కూడా ఇందుకు భిన్నమేమి కాదు. ఫ్యాక్టరీలు స్థాపించేందుకు అవకాశాలున్నప్పటికీ ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదని విమర్శలున్నాయి. రాయచూరు జిల్లాలో మెగా టెక్స్‌టైల్ పార్కులను స్థాపించేందుకు అనుకూలమైన వాతావరణం కూడా ఉంది. అయితే ఆ దిశగా అడుగులు వేయకపోవడంపై స్థానికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బళ్లారి జిల్లాలో జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ, స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలు, జీన్స్ ఉత్పత్తి తదితర పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతున్నారే కానీ ఒక్క జీన్స్ ఉత్పత్తి రంగంలో మినహా జిందాల్ లాంటి స్టీల్ కంపెనీల్లో స్థానికేతరులకే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని పోరాటాలు కూడా జరుగుతున్నాయి. కాగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధాన ప్రభావంతో ఇంజినీరింగ్ పట్టభద్రులకు కూడా స్థానికంగా కంపెనీలు ఉపాధి కల్పనకు ముందుకు రాకపోవడంతో ఆయా ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పొట్ట చేతపట్టుకొని మూటాముల్లె సర్దుకొని కుటుంబ సభ్యులతో మహానగరాలకు వలస బాట పడుతుండటం సర్వసాధారణంగా కనిపిస్తోంది.
బెళగావిలో చక్కెర ఫ్యాక్టరీలు అధికం
జేఎస్‌డబ్ల్యూ దేశంలోనే అతి పెద్దది
ఆగని ఉపాధి వలసలు


