
ధర్మస్థల 14వ పాయింటులో మలుపు
బనశంకరి: ప్రసిద్ధ పుణ్యస్థలి ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు, పూడ్చివేతలపై సిట్ అధికారులు, పోలీసులు బుధవారం 14 వ పాయింట్‌లో గాలించారు. బంగ్లా గుడ్డలో నల్లముసుగు ఫిర్యాదిదారు గతంలో చూపించిన స్థలాన్ని కాదని మరో స్థలానికి సిట్ అధికారులను తీసుకెళ్లాడు. అక్కడ నేల మీద అనేక అస్థి పంజరాలు కనిపించగా స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సామూహికంగా ఆత్మహత్య చేసుకుని ఉంటారని, అందుకే నేల మీదనే అస్థిపంజరాలు పడిఉన్నాయని అనుమానాలు వ్యక్తంచేశారు. దీని గురించి దర్యాప్తు చేపట్టాలా వద్దా అని గందరగోళంలో సిట్ అధికారులు ఉన్నారు. సస్పెన్స్‌గా ఉన్న 13 వ పాయింట్ ఖాళీగా కనిపించింది. ఇప్పటివరకు పరిశీలించిన 13 స్థలాలతో పాటు 14 వ పాయింట్ లో కూడా తవ్వకాలు చేస్తున్నారు. నల్లముసుగు వ్యక్తి 17 స్థలాల్లో మృతదేహాలను పాతిపెట్టినట్లు సిట్‌కు తెలిపాడు.
అటవీ మంత్రి స్పందన
దొడ్డబళ్లాపురం: ధర్మస్థలలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో శవాలను పూడ్చిపెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె తెలిపారు. సిట్ దర్యాప్తు, శవాల వెలికితీత పనులు పూర్తయ్యాక ఈ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో మృతదేహాలను పూడ్చిపెట్టడం నేరమన్నారు. ఇందులో నిర్లక్ష్యం చూపిన అటవీశాఖ అధికారులపైనా చర్యలు తప్పవన్నారు.
నేల మీదనే కొన్ని అస్థిపంజరాలు లభ్యం

ధర్మస్థల 14వ పాయింటులో మలుపు