
సామాజిక సందేశ చిత్రం సెప్టెంబర్ 10
బళ్లారిఅర్బన్: జీవితంలో కొందరు చిన్న కారణానికే ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తారు. ఇలాంటి మనోదౌర్బల్య మనస్తత్వం ఉన్న వారిలో ఆత్మసైర్యం నింపేలా సెప్టెంబర్ 10 అనే సినిమాను రూపొందించామని ఈ చిత్ర డైరెక్టర్ ఓం సాయి ప్రకాష్ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్య వ్యతిరేక సందేశం ఉన్న చిత్రం అని, సమాజానికి చక్కటి సందేశాన్ని ఇస్తుందన్నారు. మానసిక త్రిశంఖు స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పకుండా చూసి ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జీవితంలో ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ధైర్యం కావాలన్నారు. అదే ధైర్యాన్ని పుణికి పుచ్చుకొని మనం బతుకు పోరాటాన్ని ఎందుకు చేయరాదు? అనే సారాంశమే ఈ సినిమా కథ అన్నారు. నిరాశ నిస్పృహలో ఉన్న వారికి కౌన్సిలింగ్ లాంటి మనబలాన్ని ఇచ్చే ఆశావాదం కలిగిన చిత్రం అన్నారు. జూలై తొలి వారంలో విడుదల చేస్తున్నామన్నారు. తాను ఇప్పటి వరకు 105 సినిమాలను సాయి ప్రకాష్ దర్శకత్వం వహించారని ప్రముఖ పోషక నటుడు గణేష్‌రావ్ తెలిపారు. 90 సినిమాలు శత దినోత్సవాన్ని ఆచరించుకున్నాయని ఓం సాయి ప్రకాష్‌తో కలిసి పని చేయడం తనకెంతో గర్వకారణం అన్నారు. ఈ దర్శకుడు 125 సార్లు రక్తదానం చేసి అందరికీ స్పూర్తినిచ్చారన్నారు. ఎన్ని చిత్రాలు తీసినా ఆయన ఉల్లాసం, ఉత్సాహం తగ్గిపోలేదన్నారు. కాగా ఈ సినిమాకు జీజీ కృష్ణ ఛాయాగ్రహణం, నాగేంద్ర ప్రసాద్ సంగీతం, సాహిత్యం సమకూర్చారు. ఈ సందర్భంగా సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో నటరాజ్ కాంప్లెక్స్ థియేటర్ల మేనేజర్ లక్ష్మికాంత రెడ్డి, బళ్లారి మంజ, ఈ సినిమా హీరో జయసింహ, మేయర్ ముల్లంగి నందీష్ తదితరులు పాల్గొన్నారు.