
రైతుల హామీలు తుంగలో తొక్కారు
హొసపేటె: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రైతు సమాజానికి ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని రాష్ట్ర రైతు సంఘం, హసిరు సేన జిల్లా అధ్యక్షుడు నాగరాజ్ తళవార్ ఆరోపించారు. శనివారం హొసపేటె ప్రెస్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా చెరుకు పంట సాగు చేసే రైతులకు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, హామీలను నెరవేర్చలేదన్నారు. ఇంతవరకు నగరంలో చెరుకు కర్మాగారం ఏర్పాటుపై స్పష్టత లేదన్నారు. ఈ భాగంలో చెరుకు పండించే రైతులు నష్టాల్లో కూరుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఈనెల 20న నగరంలో జరిగే సాధన సమావేశానికి హాజరయ్యే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నల్లజెండాల ప్రదర్శన నిర్వహిస్తామని అన్నారు. జహీరుద్దీన్, ఖాజా హుస్సేన్ నియాజీ, జడియప్ప, తాయప్ప, దొడ్డ గాళెప్ప, బంతి బసవరాజ్, సునక్కి, రుద్రప్ప తదితరులు పాల్గొన్నారు.