
పుల్లయ్య కుటుంబానికి పరామర్శ
సాక్షి.బళ్లారి: అనంతపురం లోక్‌సభ మాజీ సభ్యుడు దరూరు పుల్లయ్య మృతి తీరని లోటని అనంతపురం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కే.రామకృష్ణ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని దరూరు పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం దరూరు పుల్లయ్య గుండెపోటుతో మృతి చెందిన నేపథ్యంలో కుమారుడు రమేష్, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పానన్నారు. దరూరు పుల్లయ్య సర్పంచ్ స్థాయి నుంచి సమితి అధ్యక్షుడుగా, రెండు సార్లు అనంతపురం లోక్‌సభ సభ్యుడిగా కూడా గెలుపొందారని గుర్తు చేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. హంద్రీనీవా పథకం సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించారని, ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు. 90 ఏళ్లు దాటినా ఎంతో ఉల్లాసంగా ఉండేవారన్నారు. పొలానికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందారన్నారు. ఆయన వయస్సుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉంటూ చక్కని జీవితాన్ని సాగించారన్నారు. అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయులన్నారు. ఈసందర్భంగా బళ్లారి జిల్లా సీపీఐ నాయకులు కామ్రేడ్ ఆదిమూర్తి, అనంతపురం జిల్లా సీపీఐ నాయకులు కామ్రేడ్ సీ.జాఫర్, అనంతపురం జిల్లా సీపీఐ కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ గోపాల్, కామ్రేడ్ రామకృష్ణ, కామ్రేడ్ కేశవరెడ్డి, సీపీఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శులు కామ్రేడ్ పీ.నారాయణస్వామి, కామ్రేడ్ సీ.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.