
కారు, బైక్ ఢీ–ఇద్దరి మృతి
సాక్షి,బళ్లారి: కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన గురువారం దావణగెరె జిల్లా హరిహర తాలూకా కడరనాయకనహళ్లి సమీపంలో జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న పల్లవి(26), సుమా (26) అనే ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందారు. సచిన్ అనే మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మలెబెన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీఆర్‌ఎల్ బస్సు,
జేసీబీ ఢీకొని బోల్తా
హొసపేటె: విజయనగర జిల్లాలోని మరియమ్మనహళ్లి సమీపంలో గురువారం జాతీయ రహదారి–50పై వీఆర్‌ఎల్ ప్రైవేట్ బస్సు జేసీబీ వాహనాన్ని ఢీకొట్టడంతో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న జేసీబీ వాహనాన్ని వెనుక నుంచి వీఆర్‌ఎల్ బస్సు ఢీకొని బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు జేసీబీ కూడా గుంతలోకి పడిపోయింది. ఫలితంగా బస్సు డ్రైవర్, ఆరుగురు ప్రయాణికులు, జేసీబీ డ్రైవర్‌తో సహా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.
సాధన సమావేశం ప్రభుత్వ కార్యక్రమం
● మంత్రి శివరాజ్ తంగడిగి
హొసపేటె: హొసపేటె నగరంలో ఈనెల 20న జరగనున్న సాధన సమావేశం అనేది ప్రభుత్వ కార్యక్రమం, పార్టీ కార్యక్రమం కాదు. బాధ్యతాయుతంగా వ్యవహరించడం అధికారుల బాధ్యత అని మంత్రి శివరాజ్ తంగడిగి తెలిపారు. గురువారం కూడ్లిగి పట్టణంలో సాధన సమావేశంపై నిర్వహించిన ముందస్తు ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాధన సమావేశాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు విజయవంతం చేయాలని కోరారు.
రౌడీల ఇళ్లపై పోలీసుల మెరుపుదాడి
సాక్షి,బళ్లారి: ఇటీవల దావణగెరె జిల్లాలో హత్యలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు పేట్రేగిపోతున్న తరుణంలో గురువారం దావణగెరె పోలీసులు మెరుపుదాడి చేశారు. జిల్లా ఎస్పీ ఉమాప్రశాంత్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ విజయ్‌కుమార్, పోలీసు అధికారులు మంజునాథ్, శ్యామ్ వర్గీస్, శరణబసవేశ్వర తదితరులు రౌడీషీటర్ల ఇళ్లపై దాడులు చేసి సోదాలు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేపడితే గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ముంచెత్తిన వాన
రాయచూరు రూరల్: జిల్లాలో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన జడివాన ఎనిమిది గంటల వరకు కొనసాగి భారీ వర్షం కురిసింది. జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు బురదగుంటలుగా మారాయి. రెండు గంటల పాటు కురిసిన వానతో గాంధీ చౌక్, మున్నూరు వాడి, కూరగాయల మార్కెట్‌లోకి నీరు చొరబడ్డాయి. అరబ్ కాలనీ పక్కనే వంతెన గుండా నీరు కాలనీలోకి ప్రవేశించాయి. రాయచూరు–హైదరాబాద్ రహదారిలో వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద విద్యుత్ స్తంభంతో సహా ట్రాన్స్‌ఫార్మర్ కుప్పకూలింది. ఏపీఎంసీ మార్కెట్‌లోకి వర్షపు నీరు జొరబడి ఉల్లిగడ్డలు, వరి ధాన్యం కుప్పలు తడిసి పోయాయి.

కారు, బైక్ ఢీ–ఇద్దరి మృతి

కారు, బైక్ ఢీ–ఇద్దరి మృతి

కారు, బైక్ ఢీ–ఇద్దరి మృతి

కారు, బైక్ ఢీ–ఇద్దరి మృతి