
కుష్టగి–హుబ్లీ రైలుకు పచ్చజెండా
రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలోని కుష్టగిలో గురువారం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ కుష్టగి–హుబ్లీ రైలుకు పచ్చజెండా ఊపి శ్రీకారం చుట్టారు. ముందుగా ఆయన నూతనంగా నిర్మించిన కుష్టగి రైల్వేస్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కల్యాణ కర్ణాటకలోని గదగ్–వాడి రైలు మార్గంలో కుష్టగి నుంచి హుబ్లీ మధ్య రైలు సంచారానికి ప్రస్తుతం అవకాశం కల్పించామన్నారు. వాడి వరకు ఈ రైలు మార్గ నిర్మాణం పూర్తయితే హుబ్లీ, గదగ్, యలబుర్గా, ముదగల్, లింగసూగూరు, హట్టి గోల్డ్ మైన్స్, సురపుర, శహాపుర మీదుగా హుబ్లీ నుంచి కలబుర్గి, బీదర్, హైదరాబాద్ తదితర గమ్యస్థానాలకు ప్రయాణికులు తక్కువ సమయంలో చేరుకునేందుకు వీలవుతుందన్నారు. గదగ్–వాడి రైలు మార్గంలో తళకల్ నుంచి కుకనూరు, యలబుర్గా మీదుగా కుష్టగి వరకు 58 కి.మీ. మేర మాత్రమే రైలు మార్గ నిర్మాణ పనులు ముగిశాయన్నారు. వ్యతిరేక దిశలో వాడి–శహాపుర మధ్య చేపట్టిన రైలు మార్గ నిర్మాణ పనులు ఈఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు. ఈ మార్గం ద్వారా ముంబై కర్ణాటక నుంచి కల్యాణ కర్ణాటక ప్రాంతానికి రవాణా సదుపాయం మెరుగవుతుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఆలమట్టి–యాదగిరి, భద్రావతి–చిక్కజాజూరు మధ్య రైలు మార్గ నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. వీటి వల్ల యాదగిరి, విజయపుర, చిత్రదుర్గ, బాగల్‌కోటె, దావణగెరె, శివమొగ్గ జిల్లాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కొప్పళ లోక్‌సభ సభ్యుడు రాజశేఖర్ హిట్నాళ్, మంత్రి శివరాజ్ తంగడిగి, సీఎం సలహాదారు, మాజీ మంత్రి బసవరాజ రాయరెడ్డి, మాజీ లోక్‌సభ సభ్యుడు కరడి సంగణ్ణ, శాసన సభ్యుడు దొడ్డనగౌడ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
గదగ్–వాడి మార్గంలో రైలు సంచారం షురూ
రెండు కొత్త రైల్వే లైన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ
ప్రధాని దూరదృష్టితోనే సిందూర్ విజయం
హొసపేటె: దూరదృష్టి గల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ఆస్తి అని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమణ్ణ తెలిపారు. దేశ హితం కోసం ఎప్పుడూ ఆలోచించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశాన్ని శక్తిగా తీర్చిదిద్దారన్నారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు నాయకత్వం వహించేది విద్యార్థులే, దానిని నిలబెట్టే పని వారు చేయాలన్నారు. విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకుని తమ ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వీరశైవ విద్యావర్థక సంఘం నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.

కుష్టగి–హుబ్లీ రైలుకు పచ్చజెండా