కోలారు కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు | - | Sakshi
Sakshi News home page

కోలారు కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు

Mar 25 2024 1:00 AM | Updated on Mar 25 2024 6:35 PM

కొలిక్కిరాని అభ్యర్థి ఎంపిక

సన్నగిల్లుతున్న విజయావకాశాలు

విఫలమవుతున్న అధిష్టానం బుజ్జగింపులు

కోలారు: జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు తగ్గడం లేదు సరికదా నానాటికి అధికమవుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో గ్రూపు విభేధాల కారణంగానే కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి ఎరుగని కెహెచ్‌ మునియప్ప ఘోరపరాజయం పాలై తొలిసారిగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కోలారు కాంగ్రెస్‌ గత రెండు దశాబ్దాలుగా గ్రూపు తగాదాలు ఉన్నాయి. సీనియర్‌ నాయకుడు మాజీ స్పీకర్‌ ఒక వర్గం కాగా కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కెహెచ్‌ మునియప్పది మరొక వర్గం. జిల్లా కాంగ్రెస్‌లో కెహెచ్‌ మునియప్ప – కె ఆర్‌ రమేష్‌కుమార్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కెహెచ్‌ మునియప్ప సొంత పార్టీ అభ్యర్థులనే ఓడించే ప్రయత్నం చేశారని ప్రత్యర్థులతో చేతులు కలిపి కాంగ్రెస్‌ అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచారనేది కెహెచ్‌ మునియప్ప వ్యతిరేక వర్గం ఆరోపణ. ఇదే కారణంతో గత 2019 లోక్‌సభ ఎన్నికలలో కెఆర్‌ రమేష్‌కుమార్‌, అప్పటి ముళబాగిలు ఎమ్మెల్యేగా ఉన్న కొత్తూరు మంజునాథ్‌, బంగారుపేట ఎమ్మెల్యే ఎస్‌ఎన్‌ నారాయణస్వామి తదితరులు కక్షగట్టి కెహెచ్‌ మునియప్ప ఓటమికి కారణమయ్యారు. పైగా ఇదంతా తాము కెహెచ్‌ మునియప్పనే నుంచే నేర్చుకున్నామని బంగారుపేట ఎమ్మెల్యే ఎస్‌ఎన్‌ నారాయణస్వామి బహిరంగంగా తెలిపారు. నెల రోజుల క్రితం కాంగ్రెస్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఇరు వర్గాల వారు కొట్టుకోవడంతో రెండు వర్గాల మధ్య దూరం మరింత అధికమైంది. గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరుకుంది.

కుదరని సయోధ్య :

జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాల కారణంగా లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించింది. ఏడుసార్లు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కెహెచ్‌ మునియప్పకు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉండడంతో టికెట్‌ తనకు కాకుండా తన అల్లుడు చిక్క పెద్దయ్యకు ఇవ్వాలని హైకమాండ్‌ వద్ద డిమాండ్‌ ఉంచారు. అయితే దీనిని కెహెచ్‌ వ్యతిరేకవర్గం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. కెహెచ్‌ కుటుంబంలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా తమ సహకారం ఉండదని తెగేసి చెబుతున్నారు. ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడానికి హైకమాండ్‌ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక చిక్కుముడిగా మారింది.

కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు జేడీఎస్‌ అనుకూలంగా మారుతున్నాయి. గత ఎన్నికలలో గ్రూపు తగాదాల వల్లనే ఓడిన కాంగ్రెస్‌ మళ్లీ అదే తప్పు చేస్తూ జేడీఎస్‌కు మేలుచేస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనేది చూసి అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో జేడీఎస్‌ ఉంది.

సిట్టింగ్‌ ఎంపీ ఆశలపై నీళ్లు :

బీజేపీ అధిష్టానం ఈసారి తనకే టికెట్‌ కేటాయిస్తుందని గంపెడు ఆశలతో ఉన్న సిటింగ్‌ ఎంపీ ఎస్‌ మునిస్వామి ఆశలపై బీజేపీ అధిష్టానం నీళ్లు చల్లింది. కోలారును జేడీఎస్‌కు వదలి పెట్టడంతో ముని స్వామి కోలారు టికెట్‌పై ఆశలు వదులుకున్నారు. మరో వైపు మునిస్వామి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలని, లేదా జేడీఎస్‌ టికెట్‌ను మునిస్వామికే ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్‌ చేసినా ఇదంతా ఆయన తోసిపుచ్చారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement