
దక్షిణాదిన మహా యుద్ధానికి క్షణగణన ఆరంభమైంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జరిగే ఈ సెమీ ఫైనల్స్ ఫలితాలు అత్యంత నిర్ణయాత్మకమైనవి. ఈ ఫలితాలను శాంపిల్‌గా భావించే అవకాశముంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రచారాన్ని ఎప్పుడో షురూ చేశాయి. ఇక అభ్యర్థులు, నామినేషన్ల సందడి మిన్నంటబోతోంది. ఓటరు దేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి చేయని విన్యాసాలు ఉండవు.
సాక్షి, బెంగళూరు/ శివాజీనగర: రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు ముహూర్తం ఖరారు కాగా, రాష్ట్రంలో కొత్త ఓటింగ్ యంత్రాలనే ఉపయోగిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికలాధికారి (సీఈఓ) మనోజ్‌కుమార్ మీనా తెలిపారు. బుధవారం బెంగళూరులోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ కొత్తగా తయారు చేసిన ఓటింగ్ యంత్రాలను మే 10న జరిగే పోలింగ్‌లో వినియోగిస్తామని చెప్పారు. మొత్తం బ్యాలెట్ యూనిట్‌లు 1,15,709, కంట్రోల్ యూనిట్‌లు 82,543, వీవీ ప్యాట్‌లు 89,379 ఉంటాయి. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను ఈ ఎన్నికల్లో ఉపయోగించరాదని పలు పార్టీల ప్రతినిధులు ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు విన్నవించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అమల్లోకి నియమావళి
ఎన్నికల కోడ్ బుధవారం నుంచే అమలులోకి వచ్చినట్లు మీనా తెలిపారు. అక్రమాల నివారణకు 2,040 సంచార తనిఖీ బృందాలు, 2,605 స్థానిక పర్యవేక్షణా బృందాలు, 631 వీడియో పర్యవేక్షణా బృందాలను నియమించారు. రాష్ట్రంలో మొత్తం 942 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు కాగా, ఇందులో 171 అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు. అభ్యర్థుల ఖర్చులపై నిఘా కోసం 234 మంది పరిశీలకులను నియమించారు.
ఇప్పటికి రూ.57 కోట్ల సొత్తు సీజ్
గత వారం రోజుల్లో తనిఖీల్లో రూ.57.72 కోట్ల విలువ చేసే మద్యం, నగదు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీఈఓ తెలిపారు. ఇందులో నగదు రూ.14.24 కోట్లు, 15 కిలోల బంగారు, 135 కిలోలు వెండి ఉన్నాయని చెప్పారు. ఎకై ్సజ్ శాఖ మొత్తం రూ.1.16 కోట్లు విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకొంది. ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రభుత్వ వాహనాలను వెనక్కి తీసుకున్నారు.
వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు
రాష్ట్రంలో తొలిసారి ఇంటి నుంచి ఓటు విధానాన్ని తీసుకువచ్చింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి దగ్గరే బ్యాలెట్ విధానంలో ఓటు వేయవచ్చు. అటువంటివారు 12 డీ ఫారం భర్తీ చేయాలి. ఏప్రిల్ 13న ఈసీ నోటిఫికేషన్ వెల్లడించిన తరువాత ఎన్నికల తేదీకి ఐదు రోజుల్లోగా ఈ ఫారం ద్వారా దరఖాస్తు చేస్తే పోలింగ్ రోజున సిబ్బంది ఇంటికి వచ్చి పోస్టల్ బ్యాలెట్ పత్రంలో ఓటును సేకరిస్తారు. ఇక గుర్తింపు పొందిన పాత్రికేయులు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఎన్నికల షెడ్యూల్‌లో ముఖ్య తేదీలు ఇవీ
ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 13 (గురువారం)
నామినేషన్ల సమర్పణకు ఆఖరి రోజు ఏప్రిల్ 20 (గురువారం)
నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21 (శుక్రవారం)
నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 24 (సోమవారం)
పోలింగ్ మే 10 (బుధవారం)
ఓట్ల లెక్కింపు మే 13 (శనివారం)
ఎన్నికల ప్రక్రియ ముగింపు మే 15 (సోమవారం)
రాష్ట్ర అసెంబ్లీలో సీట్లు, బలబలాలు..
మొత్తం నియోజకవర్గాలు 224
ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సీట్లు 113
ప్రస్తుతం బీజేపీ బలం 118
కాంగ్రెస్ పార్టీ 69
జేడీఎస్ 32
బీఎస్పీ 1
స్వతంత్రులు 2
ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు 36
ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు 15
రాష్ట్రంలో ఓటర్ల వివరాలు
మొత్తం 5,21,76,579 మంది
ఇందులో పురుషులు 2,62,42,561 మంది
మహిళలు 2,59,26,319 మంది
దివ్యాంగ ఓటర్లు 5,55,073
ట్రాన్స్‌జెండర్లు 4,699
సాయుధ సర్వీసుల్లో 47,779 మంది