
దువు చెప్పడానికి బదులు విద్యార్థినులతో వెకిలి చేష్టలు చేయడం
తుమకూరు: ప్రభుత్వ పాఠశాలలో బాలికలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న కీచకుడు వంటి ఉపాధ్యాయునికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకాలోని దొడ్డేరి దగ్గర బొరుగంటె గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగింది. వివరాలు... ఇక్కడ మంజునాథ్ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. చదువు చెప్పడానికి బదులు విద్యార్థినులతో వెకిలి చేష్టలు చేయడం, వారిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించడం ఇతనికి ప్రవృత్తిగా మారింది.
బడికి రావాలంటే భయపడి..
ఉపాధ్యాయుని వల్ల పాఠశాలకు రావాలంటేనే బాలికలు భయపడే పరిస్థితి నెలకొంది. చదువు మీద దృష్టి పెట్టలేకపోయారు. కొందరు బాలికలు తల్లిదండ్రులకు మొర పెట్టుకోవడంతో మంగళవారం ఉదయం మంజునాథ్ రాగానే అతనికి దేహశుద్ధి చేశారు. తరువాత పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. విద్యాశాఖ అధికారి తిమ్మరాజు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. సీఐ హనుమంతరాయప్ప, సీడీపీఓ అనిత వచ్చి విద్యార్థులను విచారించారు. టీచర్ మంజునాథ్ తప్పు చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.