మైసూరు: తాను పుట్టి పెరిగిన ఊరు అయిన వరుణలోనే చివరిసారి పోటీ చేయాలనే ఆశ ఉందని, అందుకే అక్కడే పోటీలో దిగుతా, అలాగే కోలారులో కూడా పోటీ చేస్తానని సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య అన్నారు. మంగళవారం మైసూరు నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోలారు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అక్కడి ప్రజలు, కార్యకర్తలు కోరుతున్నారని , కాబట్టి అక్కడ కూడా బరిలో ఉంటానని చెప్పారు. వరుణ నుంచి గెలిచినప్పుడు తాను సీఎం అయ్యానని, కాబట్టి లక్కీ, అన్ లక్కీ అని నమ్మకాలు లేవని చెప్పారు.
తన కుమారుడు యతీంద్ర ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్నాడు, దీని పైన చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా సిద్దు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తానడడంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. ఇందుకు హైకమాండ్ ఒప్పుకుంటుందా అనేది చర్చనీయాంశమైంది. సిద్దరామయ్య నిర్ణయంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపించడం గమనార్హం.