
మాట్లాడుతున్న జగదీష్ శెట్టర్
హుబ్లీ: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా వెల్లడి అవుతుందని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ తెలిపారు. హుబ్లీలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందే పార్టీ టికెట్ల జాబితా ప్రకటించబోమన్న ఆయన ప్రతి ఎన్నికల్లోను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయన్నారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వబోమన్న వ్యాఖ్యలు ఎవరు, ఎందుకు సృష్టించారో తెలియదన్నారు. వయస్సు, గెలిచే సత్తా తదితర కారణాలతో కొందరికి టికెట్ రాకపోవచ్చన్నారు. మరికొందరు పోటీ నుంచి స్వచ్ఛందంగా విరమించుకోవచ్చన్నారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్న వారే యడియూరప్ప ఇంటిపై దాడికి పాల్పడ్డారన్నారు. దీనిపై మంత్రివర్గ ఉప సమితిని ఏర్పాటు చేశారన్నారు. అందరి విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లపై ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. చాలా కాలం నుంచి ఈ రిజర్వేషన్‌పై డిమాండ్ ఉందన్నారు. వర్గీకరణపై గందరగోళం వల్ల రాళ్ల దాడి జరిగిందన్నారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ కూడా రాజకీయం చేస్తోందన్నారు. రాహుల్‌గాంధీ వల్ల కాంగ్రెస్‌కు తీరని నష్టం అన్నారు. రాహుల్‌గాంధీ ఎక్కడెక్కడ పర్యటిస్తారో అక్కడ ఆ పార్టీకి నష్టమే తప్ప బీజేపీకి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు.
మాజీ సీఎం జగదీష్ శెట్టర్