టెన్త్‌ పరీక్షలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Mar 29 2023 12:52 AM | Updated on Mar 29 2023 12:52 AM

- - Sakshi

సాక్షి, బళ్లారి: ఒక వైపు భగభగ మండే వేసవి ఎండలు ప్రారంభం కాగా మరో వైపు జిల్లాలో ఎన్నికల వేడి కూడా క్రమంగా పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి బళ్లారి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఆరుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రతి విద్యార్థికి టెన్త్‌ పరీక్షలు కీలకమైన నేపథ్యంలో ఈ ఏడాది ఆ పరీక్షలను ఉత్సాహంగా రాసేందుకు విద్యార్థులు సిద్ధం అవుతున్నారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల స్కూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈఏడాది విద్యార్థులు రాత్రింబగళ్లు కష్టపడి చదివితే తమ బంగారు భవిష్యత్తుకు పునాది వేయనున్న టెన్త్‌ పరీక్షలు ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి.

మెరుగైన ఉత్తీర్ణత కోసం అధికారుల నిరీక్షణ

ఈ ఏడాది ముఖ్యంగా కరోనా తదితర సమస్యల ప్రభావం చూపనందున విద్యార్థులు పూర్తి సిలబస్‌ను చదువుకుని పరీక్షలకు సర్వసన్నద్ధం అవుతున్నారు. గత ఏడాది రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో బళ్లారి జిల్లా 28 స్థానానికి దిగజారి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా బళ్లారి జిల్లా పదో తరగతి పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత సాధించడంతో విద్యాశాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఏడాది టెన్త్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు అధికారులు, ఉపాధ్యాయ బృందం తీవ్రంగా కృషి చేసి విద్యార్థులను తీర్చిదిద్దడంలో కొంత మేర సఫలీకృతమయ్యారు. జిల్లాలో ఈ ఏడాది టెన్త్‌ పరీక్షలకు బాలురు 11,634 మంది, బాలికలు 11,810 మంది హాజరు కానున్నారు.

71 పరీక్ష కేంద్రాలు సిద్ధం

పరీక్షల కోసం తూర్పు బ్లాక్‌లో 19, కురుగోడు, కంప్లిలో 27, సిరుగుప్పలో 14, సండూరు బ్లాక్‌లో 11 కేంద్రాలు కలిపి మొత్తం 71 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్షల నిర్వహణకు 1048 తరగతి గదులు, 11,772 డెస్క్‌లు సిద్ధం చేశామని, ఒక్కో తరగతి గదిలో 24 మంది విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. గత రెండేళ్ల నుంచి కరోనా నేపథ్యంలో మాస్క్‌ తప్పనిసరి నిబంధన విధించామని, ఈసారి అలాంటి నిబంధనలు ఏమీ లేవన్నారు. వారి ఇష్ట ప్రకారం మాస్క్‌ వేసుకోవచ్చు లేకపోయినా పరీక్షలకు హాజరు కావచ్చని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాసే 1616 కేంద్రాల వద్ద పర్యవేక్షణ చేపట్టేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు.

ఈసారి 10వ స్థానం ఆశిస్తున్నాం

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆందానప్ప సాక్షితో మాట్లాడుతూ ఈనెల 31 నుంచి ప్రారంభమవుతున్న టెన్త్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది టెన్త్‌ ఫలితాల్లో 10 స్థానంలో ఉండేందుకు విద్యార్థులను తీర్చిదిద్దామన్నారు. ఏడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు బాగా చదివిన వారిని గుర్తించి వారిని వివిధ రకాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం వల్ల ఆశించిన మేరకు ఉత్తీర్ణత శాతం మెరుగు పడుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

పరీక్షల నిర్వహణపై సమీక్ష

రాయచూరు రూరల్‌ : ఈనెల 31 నుంచి టెన్త్‌ పరీక్షలను సజావుగా నిర్వహించాలని దేవదుర్గ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో పరీక్ష కేంద్రాల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాలూకాలో 16 కేంద్రాల్లో పరీక్ష రాసే 4233 మంది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్భయంగా పరీక్షలు రాసే వీలు కల్పించాలన్నారు. సమావేశంలో బీఈఓ సుఖదేవ్‌, పురసభ ముఖ్యాధికారి సాబణ్ణ, శివరాజ్‌, శ్రీనివాస్‌లున్నారు.

జిల్లాలో మొత్తం విద్యార్థులు

23,444 మంది

వీరిలో బాలురు 11,634,

బాలికలు 11,810

ఈనెల 31 నుంచి ఎస్సెస్సెల్సీ పరీక్షలు షురూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement