
ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాన్ని తెరుస్తున్న దృశ్యం
కెలమంగలం: కెలమంగలం పట్టణ పంచాయతీలోని జంబుగాన్ చెరువు కట్ట తెగిపోయి చెరువుకు చేరే వర్షపునీరు పూర్తిగా బయటకెళ్లిపోయిందని, సంబంధిత శాఖాధికారులు చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ స్థానికులు విజ్ఞప్తి చేశారు. చెరువులో వర్షపునీరు నిల్వ ఉంచడం ద్వారా భూగర్భ జలవనరులు పెరిగి చుట్టుపక్కల బోరుబావుల్లో నీరు సంవృద్ధిగా ఉంటుందని, దీంతో పాటు తాగునీటి ఎద్దడి నివారించవచ్చునని, గతంలో చెరువు కట్ట తెగిపోవడంతో స్థానికులే మరమ్మతులు చేపట్టారని, గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా మళ్లీ తెగిపోయిందని, అధికారులు వెంటనే చెరువుకట్టకు మరమ్మతులు చేపట్టాలని ఆ వినతిపత్రంలో కోరారు.
యువకుడి ఆత్మహత్య
హోసూరు: అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిఫ్‌కాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాలు... హోసూరు పారిశ్రామికవాడ ఉప్కర్ రాయల్ గార్డెన్ ప్రాంతానికి చెందిన మనో (24) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చాడు. ఫలితం లేకపోవడంతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు. బంధువులు చికిత్స కోసం బెంగళూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిఫ్‌కాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
ఓటింగ్ యంత్రాలు అప్పగింత
హోసూరు: గత 15 ఏళ్లుగా వినియోగంలో ఉన్న ఓటింగ్ యంత్రాలను మంగళవారం అఖిలపక్ష పార్టీ నాయకుల సమక్షంలో బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్ సంస్థకు అప్పగించారు. జిల్లా ఎన్నికల అధికారి దీపక్ జేకప్ సమక్షంలో జిల్లా కేంద్రం క్రిష్ణగిరి బీడీవో కార్యాలయంలో భద్రపరిచిన ఈవీఎంలను బయటకు తీసి 15 ఏళ్లకు పైబడిన యంత్రాలను భారత్ ఎలక్ట్రానిక్ సంస్థకు అప్పగించారు. కార్యక్రమంలో అధికారులు రాజగోపాల్, జయశంకర్, సంపత్, మురుగన్, రాజేష్, సెందిల్‌కుమార్, అఖిల పక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.