రైల్వేస్టేషన్‌ ముట్టడికి యత్నం

- - Sakshi

శివమొగ్గ: సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యుత్వాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున మంగళవారం శివమొగ్గ నగరంలో రైల్వే స్టేషన్‌ ముట్టడించడానికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్‌ చేసి ఆపై స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు.

బోనులో చిక్కిన చిరుత

మైసూరు: మైసూరు జిల్లా టి. నరిసిపుర తాలూకా నుగ్గళికొప్పలు గ్రామ ప్రజలకు కొన్ని రోజులుగా చెమటలు పట్టిస్తున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. గత కొద్దిరోజుల క్రితం నుగ్గళికొప్పలు గ్రామంలో చిరుత ప్రత్యక్ష కావడంతో గ్రామస్తులు హడలిపోయారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అటవీ సిబ్బంది బోనులు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఆహారం కోసం వచ్చిన చిరుత బోనులో చిక్కింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

హక్కు పత్రాల పంపిణీ

మైసూరు: మైసూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ గ్రామాల్లో అర్హులైన పేదలకు హక్కు పత్రాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్‌ కేవీ రాజేంద్ర తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా పంచాయతీ సమావేశం హాల్లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు హక్కు పత్రాలు పంపిణీ చేశారు. 52 రెవెన్యూ గ్రామాల్లో 2,364 మంది పేదలకు హక్కులు పత్రాలను అందజేసినట్లు చెప్పారు.

రిజర్వేషన్ల రగడ

జాతీయ రహదారిలో టైర్లకు నిప్పు

శివమొగ్గ: రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ మంగళవారం శివమొగ్గ తాలూకా కుంచెనహళ్లి గ్రామస్తులు శివమొగ్గ–శికారిపుర జాతీయ రహదారిలో ఒక్కసారిగా ధర్నాకు దిగారు. మంగళవారం ఉదయం 6 గంటలకే రోడ్డుపైకి చేరుకున్న గ్రామస్తులు జాతీయ రహదారిలో టైర్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ఈ ఘటనలో జాతీయ రహదారిలో వందల వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి వారిని అక్కడి నుంచి తరలించారు.

వివాహిత ఆత్మహత్య

మైసూరు: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం మడికేరి నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని హోస లేఔట్‌లో అటవీ శాఖ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న భూమిక (28) ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు రెండేళ్ల క్రితం వివాహం కాగా, భర్త, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చెరువులోకి దూకి వృద్ధురాలు...

మైసూరు: అనారోగ్యంగా ఉన్న మహిళ ఒకరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. చామరాజనగర జిల్లా కొళ్ళెగాల తాలూకాలోని కుణహళ్ళి గ్రామానికి చెందిన దివంగత సోమణ్ణ భార్య గౌరమ్మ (60) అనే వృద్ధురాలు మృతురాలు. ఆమె కుమార్తె ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి కుమారుని ఇంటి నుంచి బయల్దేరింది. మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. కొడుకు గాలిస్తూ వెళ్లగా హంపాపుర గ్రామంలో ఉన్న చెరువులో తల్లి మృతదేహం పడి ఉంది. అనారోగ్యం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కొడుకు చెప్పాడు. కొళ్లేగాల పోలీసులు కేసు నమోదు చేశారు.

రౌడీలపై దాడులు

బనశంకరి: పట్టపగలు నడిరోడ్డుపై రౌడీలపై దాడులకు తెగబడ్డారు. రెండురోజుల క్రితం చామరాజపేటే దోబీఘాట్‌ వద్ద రౌడీషీటర్లు లొడ్డే ప్రవీణ్‌, స్వామిపై దుండగులు మరణాయుధాలతో దాడి చేసి ఉడాయించారు. డబ్బు లావాదేవీల విషయంలో దాడికి పాల్పడగా తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించి కెంపేగౌడనగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనపై దక్షిణ విభాగ డీసీపీ కృష్ణకాంత్‌ మాట్లాడుతూ... రౌడీషీటర్‌ ప్రవీణ్‌, స్వామిపై దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

నీటిట్యాంక్‌లో మృతదేహం

యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా మాడ్నూరు గ్రామానికి నీటిని సరఫరా చేసే ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లో మృతదేహం బయటపడింది. మృతుడిని తోటదమూలెకు చెందిన దినేశ్‌ (18)గా గుర్తించారు. మద్యానికి బానిసైన దినేశ్‌ మూడు రోజుల నుంచి అదృశ్యమయ్యాడు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కారణంగా సిబ్బంది ట్యాంక్‌కు నీటిని వదలలేదు. మంగళవారం ట్యాంక్‌లో శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top