వెహికిల్ షెడ్డు వెనక్కి!
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 7వ డివిజన్ పరిధిలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో నగరపాలకసంస్థ వాహనాల పార్కింగ్‌కు తలపెట్టిన షెడ్డు నిర్మాణ ప్రతిపాదనను అధికారులు విరమించుకున్నారు. వాహనాల షెడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయంటూ కాలనీవాసులు అభ్యంతరం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ప్రభుత్వస్థలంలో కాలనీ అభివృద్ధికి ఉపయోగపడే నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
వెహికిల్‌షెడ్డు వెనక్కి
నగరపాలకసంస్థ వాహనాల పార్కింగ్‌కు హౌసింగ్‌బోర్డుకాలనీలోని సమ్మక్కసారలమ్మ గద్దెల పక్కనున్న స్థలాన్ని ఎంపిక చేశారు. ఇప్పటికే సప్తగిరికాలనీలో వాహనాల షెడ్డు ఉండగా, అక్కడే వాహనాలు పార్క్ చేస్తున్నారు. పారిశుధ్య, ఇతర అవసరాలకు సంబంధించి కొత్తగా 30 ట్రాక్టర్లు కొనుగోలు చేయడం, సప్తగిరికాలనీలోని షెడ్డు సరిపోకపోవడంతో మరోచోట షెడ్డు నిర్మించాలని నిర్ణయించారు. హౌసింగ్‌బోర్డుకాలనీలోని 728 సర్వే నంబర్ పరిధిలో దాదాపు ఎకరం ప్రభుత్వ స్థలంలో వాహనాల షెడ్డు నిర్మాణానికి అధికారులు ఇటీవల ప్రతిపాదించారు. నాలుగు రోజుల క్రితం స్థలాన్ని చదును చేసే పనులు చేపట్టారు. చుట్టూ ఇండ్లు ఉన్న ఈ స్థలంలో వాహనాల షెడ్డు నిర్మిస్తే, వాహనాలు రాకపోకలు, మరమ్మతులు కాలుష్యంతో ఇబ్బందులు తలెత్తుతాయని సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చిన కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్‌కి స్థానికులు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. స్పందించిన కమిషనర్ ఆదేశం మేరకు షెడ్డు ప్రతిపాదనను విరమించారు. ఎస్‌టీపీ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని సూచనాప్రాయంగా నిర్ణయించినట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.


