కొలువుదీరనున్న పల్లె పాలకవర్గం
కరీంనగర్‌టౌన్: గ్రామాల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. జిల్లావ్యాప్తంగా 316 గ్రామపంచాయతీలు, 2,946 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు ఈనెల 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొదటగా ఈ నెల 20న ప్రమాణం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముహుర్తాలు సరిగా లేవని వచ్చిన ఫిర్యాదులతో 22వ తేదీన ప్రమాణ స్వీకారానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సోమవారం నుంచి నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో పంచాయతీల పరిపాలన సాగనుంది.
ప్రత్యేకపాలన నుంచి..
గత సర్పంచ్‌ల పదవీకాలం రెండేళ్ల క్రితమే ముగియగా ఇన్నాళ్లు ప్రత్యేక అధికారులపాలన సాగింది. ప్రత్యేకాధికారులు అందుబాటులో లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడ్డారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే మూడు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. గెలుపొందిన సర్పంచ్‌లు, పాలకవర్గాలతో సోమవారం నుంచి కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పాలన సాగించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అదేరోజు తొలి సమావేశం
కొత్తపాలక వర్గాలు ప్రమాణస్వీకారం చేసిన రోజే తొలి సమావేశం నిర్వహించాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ గెజిట్ విడుదల చేశారు. చట్టప్రకారం నెలకోసారి పాలకవర్గాలు భేటీ కావాల్సి ఉంటుంది. సారి గెలుపొందిన సర్పంచ్‌ల్లో ఎక్కువ మంది యువకులు, ఉన్నత విద్యను అభ్యసించిన వారు, సర్పంచ్‌లుగా పని చేసిన వారే మళ్లీ గెలుపోందడంతో అభివృద్ధిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
బలబలాలు ఇవే..
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేయకున్నా గెలిచిన అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతుదారులే కావడంతో రాజకీయ రంగు అంటుకుంది. 316స్థానాల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు 123 స్థానాలను కై వసం చేసుకున్నారు. బీఆర్‌ఎస్ మద్దతుదారులు 114, బీజేపీ మద్దతుదారులు 43, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ మద్దతుదారులు 36మంది మిగతా చోట్ల విజయం సాధించారు.
నిధుల ఇక్కట్లు తీరేనా?
గ్రామ పంచాయతీలను రెండేళ్లుగా నిధుల కొరత వేధిస్తోంది. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని పంచాయతీ ఖాతాల్లో నిధులు అందుబాటులో లేవు. పల్లెల్లో పారిశుధ్యం, తక్షణ అవసరాలు, వీధిలైట్లు, డ్రైనేజీ, అంతర్గత రహదారులు, పచ్చదనం వంటి ప్రాథమిక అంశాలు, జీపీ కార్మికుల వేతనాలు సకాలంలో చెల్లించలేక కార్యదర్శులకు పాలన తలకు మించిన భారంగా మారింది. ఖజానా మొత్తం ఖాళీ కావడంతో కొత్తసర్పంచ్‌లు మొదట సొంతనిధులు వినియోగించాల్సిన అవసరముంది. రెండుళ్లుగా ఆర్థిక సంఘం, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నిధులు రాకపోవడంతో పల్లెల్లో పాలన పడకేసింది. తర్వలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే ఆలోచన వస్తుడడంతో మళ్లీ నిధుల ఇక్కట్లు తప్పేలా లేదు. సంక్రాంతి లోపు నిధులు రాకుంటే పరిషత్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశముంది.


