ఖర్చు దాచితే కుర్చీ గల్లంతే
సర్పంచ్, వార్డు అభ్యర్థులకు లెక్కల చిక్కు గెలిచినా.. ఓడినా ఖర్చులు చెప్పాల్సిందే 45 రోజుల్లోగా ఎస్‌ఈసీకి సమర్పించాలి ఈ సారి ‘టీఈ–పోల్’ పోర్టల్లోకి లెక్కలు జిల్లాలో 316 పంచాయతీలకు ఎన్నికలు
కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాక గెలిచిన వారు సంబరాలు చేసుకుంటుంటే.. ఓడిన వారు అప్పుల లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఎలక్షన్ల ఖర్చులెక్క చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు కోసం అడ్డగోలుగా ఖర్చుచేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్క రూపాయి ఎక్కువ కాకుండా లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. లేదంటే పదవి గల్లంతయ్యే అవకాశముంది. ఖర్చు చేయడం ఒక ఎత్తయితే.. దానిని నిబంధనల ప్రకారం తగ్గించి లెక్కచెప్పడం తలకు మించిన భారంగా అభ్యర్థులు భావిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు తాము చేసిన ఖర్చుల లెక్కలను 45 రోజుల్లోగా ఎంపీడీవోలకు సమర్పించి రశీదు తీసుకోవాల్సిందేనని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈసారి సదరు వివరాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు కాగితం రూపంలో ఎంపీడీఓలకు సమర్పించిన వివరాలను, అధికారులు టీఈ– పోల్ వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఈ నివేదికలను 2026 ఫిబ్రవరి 15లోగా పంపాలని స్టేట్ ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఆదేశాలు జారీ చేసింది.
గడువులోపు సమర్పించకపోతే వేటే
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఖర్చు లెక్కలను అప్పచెప్పకుంటే అనర్హత వేటు తప్పదంటున్నారు అధికారులు. ఎన్నికల నిబంధన ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు... వారికి గుర్తులు కేటాయించిన రోజునుంచి ఫలితాలు వెలువడే వరకు ఖర్చు చేసిన లెక్కలు ఎంపీడీవోలకు అప్పగించాలి. 45 రోజుల్లోగా లెక్కల వివరాలు సమర్పించకపోతే పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 23 ప్రకారం వేటు పడుతుంది. గెలిచిన అభ్యర్థులు పదవి కోల్పోవడంతో పాటు మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారు. ఓడినవారు సైతం మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు.
316 పంచాయతీల్లో ఎన్నికలు
జిల్లాలో మొత్తం 318 గ్రామ పంచాయతీలు ఉండగా 316 పంచాయతీలు, 2,946 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. సర్పంచ్‌లు నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం, రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించాలి. పంచాయతీ వార్షిక ఆడిట్లు, లెక్కలు పూర్తి చేయకపోయినా, అవినీతికి పాల్పడినా పదవి కోల్పోయే ప్రమాదముంది. ఈ మేరకు కొత్త సర్పంచ్‌లకు అవగాహన కల్పించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
కరీంనగర్‌స్పోర్ట్స్: శాతవాహన యూనివర్సిటీలోని సైన్స్ కళాశాలలో శనివారం వైస్ చాన్స్‌లర్ ఉమేశ్ కుమార్ క్రీడాశాలను ప్రారంభించారు. క్యారమ్ ఆడి విద్యార్థుల్లో ఉత్తేజం నింపారు. క్రీడలతో శారీరక దృఢత్వం వస్తుందని, విద్యార్థులు ఒత్తిడిని జయించాలంటే క్రీడల్లో పాల్గొనాలన్నారు. ప్రిన్సిపాల్ ఎస్.రమాకాంత్, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ నజీముద్దీన్ మున్వర్, కృష్ణ కుమార్ పాల్గొన్నారు.
ఈ తేదీల్లోగా సమర్పించాలి
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.1,50,000 వరకు ఖర్చు చేయవచ్చు. వార్డు మెంబర్ పోటీ చేసే అభ్యర్థి అయితే రూ. 30,000 వరకు ఖర్చు చేయవచ్చు. 5 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా రూ. 2,50,000 వరకు... వార్డు అభ్యర్థి రూ.50,000 వరకు ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలివిడత ఎన్నికల్లో పాల్గొన్నవారు 2026, జనవరి 24 లోపు, రెండో విడత జనవరి 27న, మూడో విడతలో పోటీ చేసిన అభ్యర్థులు జనవరి 30 లోపు తమ ఖర్చుల వివరాలను ఎంపీడీవోలకు సమర్పించాలి.
ఖర్చు దాచితే కుర్చీ గల్లంతే


