సుడా భవన నిర్మాణంలో నాణ్యత పాటించాలి
● నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్
కరీంనగర్ కార్పొరేషన్: శాతవాహన అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ (సుడా) కార్యాలయ భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని నగరపాలకసంస్థ కమిషనర్, సుడా వైస్‌చైర్మన్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం నగరంలోని సిక్‌వాడీలో నూతనంగా నిర్మిస్తున్న సుడా కార్యాలయ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పునాది, పిల్లర్ పనులను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత డిజైన్ ప్రకారం సుడా కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్ చేపడుతున్న ప్రతి పనిపై ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఎస్‌ఈ రాజ్ కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, సుడా డీఈ రాజేంద్రప్రసాద్, ఏఈ సతీశ్ పాల్గొన్నారు.
713 మందికి షోకాజ్ నోటీసులు
కరీంనగర్‌టౌన్: మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు అనుమతి లేకుండా గైర్హాజరైన 713 మంది ఉద్యోగులకు జిల్లా విద్యాధికారి, గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారి అశ్విని తానాజీ వాకడే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో జరిగిన ఎన్నికల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర పోలింగ్ ఆఫీసర్లుగా విధులు కేటాయించినప్పటికీ కొందరు విధులకు హాజరు కాలేదని, తద్వారా ఎన్నికల నిర్వహణకు అసౌకర్యం ఏర్పడిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు, సీసీఏ నియమాల ప్రకారం సదరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోరాదో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు.


