రంగు పడింది!
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డివైడర్లకు కొత్తగా రంగులు పడుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ కింద బ్యూటిఫికేషన్‌లో భాగంగా ఈ రంగులు వేస్తున్నట్లు చెబుతున్నా, టెండర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రూ.30 లక్షలు గోల్‌మాల్ అయినట్లు జరుగుతున్న ప్రచార క్రమంలో హఠాత్తుగా డివైడర్లకు రంగులు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుండడం తెలిసిందే. ఆయా మున్సిపాలిటీలు, నగరపాలకసంస్థలు స్వచ్ఛతలో ర్యాంక్‌లు సాధించేందుకు ఈ నిధులు వెచ్చిస్తుంటారు. తడి, పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన పెంచడం, పారిశుధ్యాన్ని పాటింపచేసేలా ప్రజలను చైతన్యపరిచేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నగరంలో అలాంటి ప్రచారాలు లేనప్పటికి, రూ.30 లక్షలు బిల్లు చెల్లిస్తున్న వ్యవహారాన్ని ఇటీవల ‘సాక్షి’లో ‘రంగులేశారట’ పేరిట వెలుగులోకి తేవడం తెలిసిందే. ఎలాంటి రంగులు లేకుండానే రూ.30 లక్షలు స్వాహా చేసేందుకు సిద్దమయ్యారనే కథనం బాధ్యుల్లో కలవరాన్ని పుట్టించింది. ఈ క్రమంలో నగరంలోని బస్‌స్టేషన్‌కు సమీపంలోని మెయిన్‌రోడ్ డివైడర్లకు హఠాత్తుగా రంగులు వేస్తుండడం కలకలం రేపింది. ఈ రంగులకు సంబంధించి అసలు టెండర్ పిలిచారా, టెండర్‌లేకుండానే పనులు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ రంగులు ఎవరేస్తున్నారో, ఎందుకు వేస్తున్నారో, టెండర్ పిలిచారో లేదో కూడా తమకు తెలియదని నగరపాలకసంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. హఠాత్తుగా డివైడర్లపై ప్రత్యక్షమైన రంగులకు, స్వచ్చ సర్వేక్షన్‌లో రూ.30 లక్షల గోల్‌మాల్ వ్యవహారానికి ఏదైనా లింకు ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా నగరంలో చేపట్టిన కార్యక్రమాలు, పిలిచిన టెండర్లు, చెల్లించిన బిల్లులు.. ఈ మొత్తంపై వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని సామాజిక కార్యకర్తలు, పలువురు మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.


