చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): భారత రాజ్యాంగంలోని చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవా లని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్ సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి వెంకటేశ్ రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాల గురించి వివరించారు. జాతీయ న్యాయ సేవల టోల్ ఫ్రీ నంబర్ 15100, మాదక ద్రవ్యాల నిరోధక, సైబర్ క్రైం టోల్ ఫ్రీ నంబర్లు తప్పకుండా గుర్తుంచుకోవాలన్నారు. బాలికలు అన్ని పరిస్థితులలో ధైర్యంగా ఉండాలని, ఏదైనా సమస్య తలెత్తితే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు. బాల్యం దశనుంచే విద్యపై పట్టు సాధించి భవిష్యత్‌లో ఉన్నతస్థానాల్లో నిలవాలని పిలుపునిచ్చారు. లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, హెచ్‌ఎం కన్నం రమేశ్ పాల్గొన్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌లోని గోపికృష్ణ ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 12వ తేదీన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 జిల్లా సర్వసభ్య సమావేశంతో పాటు నూతన కమిటీ ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని యూనియన్ కంపెనీ కార్యదర్శి సల్వాజి వెంకట రమణారావు తెలిపారు. కరీంనగర్‌లోని యూనియన్ కార్యాలయ ఆవరణంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన సన్నాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1104 యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యవర్గ సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేమునూరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, కంపెనీ అధ్యక్షుడు బి.రఘునందన్‌తో పాటు కంపెనీ కార్యవర్గ సభ్యులు హాజరై ఉద్యోగుల సమస్యలపై వివరణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్ ఇన్‌చార్జి కార్యదర్శిగా రాజా నియామకం అయ్యారు. ఇక్కడ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా విధులు నిర్వహించిన మల్లేశంను వరంగల్ ఎనమాముల మార్కెట్‌కు ఇన్‌చార్జి కార్యదర్శిగా బదిలీ చేశారు. గ్రేడ్– 2కార్యదర్శి ఉన్న రాజా ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ చైర్ పర్సన్ పూల్లూరి స్వప్న, వైస్ చైర్మన్ ఎర్రం సతీశ్‌రెడ్డి, డైరెక్టర్లు దీక్షత్‌గౌడ్, శ్రీపతిరెడ్డి, సూర్య అభినందించారు. కాగా.. మార్కెట్‌లో శుక్రవారం క్వింటాల్ పత్తి ధర రూ.7,000 పలికింది. 114 వాహనాల్లో 1,073 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.6,700, కనిష్ట ధర రూ.6,000లకు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. శని,ఆదివారాలు మార్కెట్‌కు సాధారణ సెలవులు ఉంటాయని, సోమవారం యథావిధిగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని ఇన్‌చార్జి కార్యదర్శి రాజా తెలిపారు.
కొత్తపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 వేల మంది ఆర్టిజన్ కార్మికులను ఏపీఎస్‌సీబీ సర్వీస్ రూల్స్ కల్పిస్తూ కన్వర్షన్ చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయాలని కరీంనగర్‌లోని ఓ హాల్‌లో శుక్రవారం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర, కంపెనీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర జేఏసీ చైర్మన్ సతీశ్‌రెడ్డి, కన్వీనర్ సాయిలు, చంద్రారెడ్డితో పాటు ఎన్‌పీడీసీఎల్ కంపెనీ కార్యవర్గ నాయకులు పాల్గొన్నారు. అనంతరం తొమ్మిది యూనియన్లతో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీని ఎన్నుకున్నారు.
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి


