ప్రభుత్వ భూమిలో రేకుల షెడ్డు
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ కార్పొరేషన్‌లో విలీనమైన ఆరెపల్లిలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో దర్జాగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదు చేసినా మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆరెపల్లి గ్రామాన్ని కార్పొరేషన్‌లో విలీనం చేయడంతో భూమికి విలువ పెరిగింది. గుంటకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలవరకు డిమాండ్ ఏర్పడింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వహయాంలో సర్వేనంబరు 120లో డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని నిర్మించారు. ఇప్పటివరకు లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో నిరుపయోగంగా మారి ఇళ్లు శిథిలావస్ధకు చేరాయి. ఆర్నేళ్లక్రితం మున్సిపల్ కార్పొరేషన్‌కు తాగునీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పధకంలో భాగంగా మిగిలిన ప్రభుత్వ స్థలంలో రెండు వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. ఓ వ్యక్తి మాజీ ప్రజాప్రతినిధి అండతో రెండుగుంటల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. స్థానికులకు పట్టా భూమిగా నమ్మిస్తూ.. వారం రోజుల నుంచి రేకులషెడ్డు నిర్మాణం చేపట్టాడు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణంపై గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, కరీంనగర్‌రూరల్ తహసీల్దార్ రాజేశ్‌కు బీజేపీ నాయకుడు బారి జితేందర్ ఫిర్యాదు చేశాడు. సుమారు రూ.50లక్షల విలువైన ప్రభుత్వస్థలం ఆక్రమణపై సమగ్ర విచారణ నిర్వహించాలని కోరాడు. సర్వేనంబరు 120లోని ప్రభుత్వ స్థలాన్ని అమృత్ పథకం కింద వాటర్ ట్యాంకుల నిర్మాణం కోసం మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగించామని తహసీల్దార్ రాజేశ్ తెలిపారు. అక్రమ నిర్మాణం పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించినట్లు వివరించారు.


