రాయ‘బేరాలు’
ముస్తాబాద్(సిరిసిల్ల): ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు లక్కీడ్రా ప్రక్రియ అక్టోబర్‌లో ముగిసింది. కొత్తవారికే ఎక్కువ మద్యం దుకాణా లు రావడంతో, ఇప్పటికే ఈరంగంలో ఉన్న వ్యాపారులు నిరాశకు గురయ్యారు. పదుల సంఖ్యలో దరఖాస్తులు వేస్తే సరైన దుకాణాలు రాలేదని పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న దుకాణాలు దక్కించుకునేందుకు రాయబేరాలు మొదలు పెట్టారు. గుడ్‌విల్ రూ.కోటి వరకు ఇచ్చి వైన్స్‌ను తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే వైన్స్ నడపడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండడంతో నో ఫ్రాఫిట్, నో లాస్ విధానంతో మద్యం దుకాణాలు నడిపేందుకు ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో 99 దరఖాస్తులు వేసిన ఓ సిండికేట్‌కు నామమాత్రంగా రెండు దుకాణాలే రావడంతో, మరింత పెట్టుబడి పెట్టి వైన్స్‌ను తీసుకోవాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మద్యం దుకాణాలకు కోడింగ్ ద్వారా ఎంపిక చేసేవారు. పదేళ్లుగా దరఖాస్తులు, లాటరీ పద్ధతిన దుకాణాలను కేటాయిస్తున్నారు.
ప్రభుత్వానికి పోటీగా ఆదాయం
లక్కీడ్రాలో దుకాణాలు వచ్చిన అదృష్టవంతులు జాక్‌పాట్ కొడుతున్నారు. గుడ్‌విల్ కింద రూ.60 లక్షల నుంచి రూ.కోటి ఇరవై లక్షల వరకు దుకా ణాలకు చెల్లించడమే దీనికి కారణం. కొత్తగా వ్యాపారంలోకి వచ్చిన వారితోపాటు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమూహంగా ఏర్పడి దరఖాస్తులు చేసుకున్న వారే అధిక సంఖ్యలో లక్కీడ్రాలో దుకా ణాలు దక్కించుకున్నట్లు భావిస్తున్నారు. పది నుంచి ఇరవై దుకాణాలు ఇతరుల చేతిలోకి మారినట్లు తెలుస్తోంది. వారు గుడ్‌విల్‌గా రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తి గత మూడు పర్యాయాలు దుకాణాలకు దరఖాస్తులు చేసి లక్కీడ్రాలో విజేతగా నిలిచాడు. సదరు వ్యక్తి ఒక్కసారి కూడా వైన్స్ నిర్వహించలేదు. ఇతరులకే గుడ్‌విల్ కింద అప్పగించాడు.
రూ.కోట్లు పలుకుతున్న గుడ్‌విల్ జాక్‌పాట్
అదృష్టవంతులకు ఎర
చక్రం తిప్పుతున్న లిక్కర్ వ్యాపారులు


