అర్బన్‌లో తగ్గిన ఓటింగ్
9,287 ఓటర్లకు 4,114 పోలింగ్.. 5,173 నాన్ పోలింగ్
కరీంనగర్‌లో 45.95 శాతం, జగిత్యాలలో 38.31 శాతం నమోదు
పోలింగ్ వివరాల వెల్లడిలో నిర్లక్ష్యం
అర్ధరాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో ఓటింగ్ భారీగా తగ్గింది. 9,287ఓటర్లకు 5,173 మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండగా 4114 మంది మాత్రమే ఓటేశారు. సుదీర్ఘ విరామం తరువాత జరిగిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలకు ఓటేసిన వారి కన్నా ఓటేయని వారే అధికంగా ఉండటం ఓటర్ల నిర్లక్ష్యమా.. ఎన్నికల యంత్రాంగం లోపమా అన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్‌లో 45.95శాతం పోలింగ్ నమోదు కాగా జగిత్యాలలో అంకెలు మరింతగా దారుణంగా ఉన్నాయి. 2015 మంది ఓటర్లకు గానూ 772 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 2గంటల వరకు సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కరీంనగర్ సీపీ గౌస్‌అలం, జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌లు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఎన్నికల అధికారి సీహెచ్ మనోజ్‌కుమార్ పోలింగ్‌ను పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. 12 డైరెక్టర్ పోస్టులకు గానూ 54మంది పోటీ చేస్తుండగా జనరల్ కేటగిరీలో 9 డైరెక్టర్లకు గానూ 41మంది, 2 మహిళా డైరెక్టర్లకు గానూ 5గురు, ఒక ఎస్సీ, ఎస్టీ డైరెక్టర్‌కు గానూ 8మంది బరిలో నిలిచిన విషయం విదితమే.
గంటన్నర మాత్రమే హడావుడి
శనివారం ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఏడుగంటల పాటు ఓటింగ్ జరిగింది. 7నుంచి 8.30గంటల వరకు మందకొడిగా పోలింగ్ సాగగా తదుపరి అరకొరగా ఓటర్లు వచ్చారు. 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు కోలాహలం కనిపించింది. త్రిముఖ పోరులో కీలకమైన డైరెక్టర్ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను సెంటర్లకు తరలించారు. పలువురు తమ సొంత వాహనాల్లో తమ అనుచరులతో ఓటర్లను పోలింగ్ కేంద్రానికి చేర్చినా పోలింగ్ సగం కూడా కాకపోవడం ఆశ్చర్యకర పరిణామం. కరీంనగర్‌లో 45.95శాతం పోలింగ్ జరగగా జగిత్యాలలో అత్యంత తక్కువగా 38.31శాతం పోలింగ్ అంటే 2015 మంది ఓటర్లకు 772 మంది మాత్రమే ఓటేశారు. పోలింగ్ ముగిశాక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రానికి బ్యాలెట్ బాక్స్‌లను తరలించారు.
ఓట్ల లెక్కింపు ఆలస్యం
ఓట్ల లెక్కింపు 4గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా పలు బూత్‌లో ఓటర్లుండటంతో ప్రక్రియ ఆలస్యమైంది. జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ జూని యర్ కళాశాల పోలింగ్ కేంద్రం నుంచి కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు బ్యాలెట్లు రావడంలో ఆలస్యంతో పాటు మూడు బ్యాలెట్లు కావడంతో వాటిని జనరల్, మహిళా, ఎస్సీ,ఎస్టీ కేటగిరీలో కట్టలు కట్టడానికి సమయం పట్టింది. రాత్రి 8.25 గంటలకు రెండు టేబుళ్లలో కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. తక్కువ సంఖ్యలో ఓటింగ్ జరగగా ఫలితాల వెల్లడి రాత్రి పది గంటల వరకు తేలిపోతుందని భావించగా కౌంటింగ్ వేకువ జాము వరకు కొనసాగింది. ఆదివారం పూర్తి స్థాయిలో ఫలితాల వివరాలు వెల్లడించనున్నారు. 12మంది డైరెక్టర్లు ఎవరో తేల్చే కౌంటింగ్ కాగా ఓ పెన్ కేటగిరీకి తెల్లబ్యాలెట్, మహిళా కేటగిరీకి గులాబీ రంగు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి నీలి రంగు బ్యాలెట్ పేపర్ వినియోగించిన సంగతి తెలిసిందే.
అర్బన్‌లో తగ్గిన ఓటింగ్


