
మసాల ఘాటు
చికెన్‌లో కారం..
జగిత్యాలక్రైం: లక్ష్మీపూర్‌లోని మహాత్మ జ్యోతి బాపూలే బాలికల గురుకులంలో వండిన చికెన్‌లో కారం, మసాల ఘాటు అధికంగా ఉందని విద్యార్థినులు చెప్పినా నిర్వాహకులు అదే వడ్డించారు. దీంతో ఆరుగురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ప్రిన్సిపల్ చైతన్యలత ఆరో తరగతి చదువుతున్న సాత్విక, శ్రీనిక, తొమ్మిదో తరగతి చదువుతున్న పరిచయ, పదో తరగతి చదువుతున్న లక్ష్మీప్రసన్న, శ్రీజను జగిత్యాలలోని మాతాశిశు సంరక్షణ ఆస్పత్రికి తరలించారు. గురుకులంలో బుధవారం ఉదయం విద్యార్థినులకు పులిహోర పెట్టారు. మధ్యాహ్నం బెల్లంతో వండిన అన్నం వడ్డించారు. సాయంత్రం బగారాతోపాటు చికెన్ పెట్టారు. ముందుగా ఆహారం రుచి చూసిన కొందరు చికెన్‌లో కారం, మసాల ఎక్కువైందని తెలిపారు. అయినప్పటికీ మిగతా విద్యార్థినులకు అదే భోజనం వడ్డించారు. అది కాస్తా వికటించి సుమారు రెండు గంటల ప్రాంతంలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తోటి విద్యార్థినుల సమాచారం మేరకు హాస్టల్ నిర్వాహకులు ఐదుగురిని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. మరో విద్యార్థినిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కళాశాలలోని సుమారు 30 నుంచి 35 మంది కూడా కడుపునొప్పి, గ్యాస్‌ట్రబుల్‌తో బాధపడ్డారు. గురువారం ఉదయం జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ వసతి గృహానికి విద్యార్థినులను పరీక్షించి వైద్యసేవలు అందించారు. సాయంత్రం వరకు వసతి గృహంలోని విద్యార్థినులు కోలుకున్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాతాశిశు సంరక్షణ కేంద్రానికి వెళ్లి చికిత్స పొందుతున్న ఐదుగురితో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, ఎలాంటి అపాయం లేదన్నారు. పిల్లలు పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జి చేస్తామన్నారు. పాఠశాలలోని వంటగదితోపాటు, నిత్యావసర సామగ్రిని జిల్లా ఆహార తనిఖీ అధికారి అనూష పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థినులకు వైద్య పరీక్షలు అందించారు. జగిత్యాల రూరల్ ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో రవిబాబు గురుకులంలోనే ఉండి పర్యవేక్షించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఫుడ్‌పాయిజన్
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయ్యిందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. పిల్లలకు మెరుగైన ఆహారం అందించాలన్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో గురుకుల పరిస్థితి దారుణం
జగిత్యాల: పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సంబంధిత శాఖకు మంత్రి ఉన్నా.. లేనట్లేనని తెలిపారు. సాంఘిక, సంక్షేమ, మైనార్టీ, గిరిజన శాఖకు మంత్రి ఉన్నా.. ఒక్క గురుకులాన్ని సందర్శించలేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో గురుకుల విద్యాలయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో గురుకులాలు గాడితప్పాయని విమర్శించారు. అధికారులు స్పందించి సమస్యకు మూలకారణాలు తెలుసుకుని పరిష్కరించాలన్నారు.
విద్యార్థినులు చెప్పినా అదే భోజనం వడ్డింపు
అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన ఆరుగురు
వసతి గృహంలోనే వైద్య శిబిరం ఏర్పాటు

మసాల ఘాటు

మసాల ఘాటు