
‘మావో’లను అంతం చేస్తారా?
పెద్దపల్లిరూరల్: దేశంలో మావోయిస్టులను అంతం చేస్తామంటూ కేంద్రంలోని బీజేపీ పాలకులు ఆపరేషన్ కగార్ పేరిట మారణకాండ సాగిస్తున్నారని, అయినా మావోలను అంతం చేయలేరని, చేయడం ఎవరి తరమూ కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూసంనేని సాంబశివరావు అన్నారు. జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో గురువారం సీపీఐ జిల్లా నాలుగో మహాసభలో పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చాడ వెంకటరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్టీ పతాకం ఆవిష్కరించిన అనంతరం సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. సుప్రీంకోర్టు సుమొటోగా స్వీకరించి కేంద్రంలోని బీజేపీ సర్కార్ సాగిస్తున్న ఆపరేషన్ కగార్‌ను ఆపేలా ఆదేశాలను ఇవ్వాలని కోరారు. ఆటవిక చట్టాలను అమలు చేస్తూ పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన అమాయక ఆదివాసీలను అంతమొ ందిస్తోందని ధ్వజమెత్తారు. వామపక్ష నేతలంతా ఒకేతాటిపైకి వచ్చి కార్మిక, కర్షక హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సుదీర్ఘ కాలం పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాసేందుకు కేంద్రప్రభుత్వం కుటిల యత్నాలు సాగిస్తోందని మండిపడ్డారు. 100 ఏండ్ల చరిత్రగల సీపీఐ పార్టీని కార్యకర్తలు కాపాడుకుంటే ప్రజాస్వామ్యాన్ని పార్టీ రక్షిస్తుందని రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సభల్లో నాయకులు శంకర్, గౌతంగోవర్ధన్, సూర్య, ప్రీతం, తాండ్ర సదానందం తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి
సుప్రీంకోర్టు సుమోటోగా జోక్యం చేసుకోవాలి
పోరాటాలతో తెచ్చిన కార్మిక చట్టాలను కాపాడుకుందాం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు చాడ వెంకటరెడ్డి