
గుర్తు తెలియని వాహనం ఢీ
● ఇద్దరు యువకుల దుర్మరణం
● రేణికుంట వద్ద ఘటన
తిమ్మాపూర్: రాజీవ్ రహదారి గురువారం వేకువజామున నెత్తురొడింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎల్‌ఎండీ ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా బెజ్జంకికి చెందిన కోడూరి భానుప్రసాద్(19) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని స్నేహితుడు, గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన బామండ్ల నరేశ్(17)తో కలిసి బుధవారం రాత్రి పని నిమిత్తం ద్విచక్రవాహనంపై కరీంనగర్ వెళ్లారు. గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తున్నారు. రేణికుంట శివారులో రాజీవ్ రహదారిపై గుర్తు తెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఇద్దరూ కిందపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఎల్‌ఎండీ ఎస్‌ఐ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. భానుప్రసాద్ తల్లి రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పోక్సో కేసులో పదేళ్ల జైలు
కరీంనగర్‌క్రైం: బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడైన అక్కినపల్లి వంశీధర్‌కు పదేళ్ల జైలుశిక్ష, రూ.6వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా జడ్జి వెంకటేశ్ గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. కరీంనగర్ వన్‌టౌన్ పరిధిలో నివసించే మహిళ కూలీ పని చేసుకుంటూ తన ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది. జూన్ 29, 2020న 9వ తరగతి చదువుతున్న తన రెండో కూతురు కనిపించకపోవడంతో వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొద్దిరోజుల తరువాత కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చి తల్లికి ఫోన్ చేసింది. తనకు రేకుర్తికి చెందిన ఆటోడ్రైవర్ అక్కినపల్లి వంశీధర్ పరిచయం అయ్యాడని, మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని తెలిపింది. పెళ్లి చేసుకోవాలని అడగగా.. అతడికి అంతకుముందే పెళ్లయిందని బెదిరించి కరీంనగర్ బస్‌స్టేషన్‌లో వదిలి వెళ్లాడని సదరు బాలిక తల్లికి వివరించింది. దాంతో బాలిక తల్లి వంశీధర్‌పై వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి సీఐ విజయ్‌కుమార్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జిషీట్ వేశారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పంజాల కుమారస్వామి విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి నిందితుడు అక్కినపల్లి వంశీధర్‌కు జైలుశిక్ష, జరిమానా విధించారు.
కరీంనగర్ కోర్టుకు హాజరైన అఘోరి శ్రీనివాస్
కరీంనగర్‌క్రైం: ఉమ్మడి రాష్ట్రంలో హల్‌చల్ చేసిన అఘోరి శ్రీనివాస్ గురువారం కరీంనగర్ కోర్టుకు హాజరయ్యాడు. కొత్తపల్లి పోలీసులు పీటీ వారెంటుపై చర్లపల్లి జైలు నుంచి తీసుకొచ్చి కరీంనగర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషాన్‌పల్లికు చెందిన శ్రీనివాస్‌తో జిల్లాకు చెందిన ఓ మహిళకు నవంబర్ 2024లో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్ తనపై లైంగిక దాడి జరిపాడని, జనవరి 2025లో కొండగట్టు తీసుకెళ్లి తాళికట్టాడని, రూ.3 లక్షలు తీసుకున్నాడని సదరు మహిళ కొత్తపల్లి పోలీసులకు 2025 ఏప్రిల్ 28న ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాస్‌పై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చర్లపల్లి జైల్లో ఉన్న శ్రీనివాస్‌ను పీటీ వారెంట్ ద్వారా కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు శ్రీనివాస్‌కు ఈనెల 23వరకు రిమాండ్ విధించింది. అనంతరం శ్రీనివాస్‌ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
పొలంలో కుప్పకూలిన రైతు
ఇల్లందకుంట: మండలంలోని మర్రివానిపల్లిలో పొలంలో పని చేస్తుండగా ఓ రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. గ్రామానికి చెందిన కనుకుల నరసింహారెడ్డి(70) గురువారం తన వ్యవసాయ బావి వద్ద పొలంపనులు చేస్తున్నాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమీప రైతులు గమనించేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య సరోజన, కొడుకు, కూతురు ఉన్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీ