గాడిన పెట్టాల్సిందే!
● బల్దియాలో అదుపు తప్పిన పాలన ● అధికారుల్లో కొరవడిన సమన్వయం ● ఉద్యోగుల్లో లోపించిన జవాబుదారీతనం ● బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్
ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి
● నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్ కార్పొరేషన్: ప్రణాళికబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని నగరకపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేర్చడం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం తమ ప్రాధాన్యతలన్నారు. శుక్రవారం నగరపాలకసంస్థ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కమిషనర్‌గాఉన్న చాహత్ బాజ్‌పేయ్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ప్రఫుల్‌దేశాయ్ మాట్లాడుతూ వచ్చే 50 సంవత్సరాలకు అనువుగా మాస్టర్‌ప్లాన్ ప్రకారం నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. స్మార్ట్‌సిటీతో పాటు ఇతర నిధులతో చేపట్టిన పనులు పెండింగ్‌లో ఉంటే పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువవికాసం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు అర్హులకు అందేలా చూస్తామన్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, బర్త్, డెత్ సెక్షన్లలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అసెస్మెంట్, అండర్ అసెస్మెంట్లు, ఇంటి అనుమతులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. విలీన గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డంప్‌యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూస్తామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తామని, అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తామన్నారు. నిబంధనలను పాటించి డీలిమిటేషన్ చేస్తామని స్పష్టం చేశారు. కాగా.. గతేడాది ఆగస్టు 21వ తేదీన చాహత్ బాజ్‌పేయ్ నగరపాలకసంస్థ కమిషనర్‌గా బదిలీపై వచ్చారు. అప్పుడు ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న ప్రఫుల్‌దేశాయ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. తాజా బదిలీల నేపథ్యంలో కమిషనర్‌గా ప్రఫుల్‌దేశాయ్‌కి బాధ్యతలు అప్పగించి చాహత్ బాజ్‌పేయ్ వరంగల్ వెళ్లారు.
కరీంనగర్ కార్పొరేషన్:
అధికారుల్లో కొరవడిన సమన్వయం, ఉద్యోగుల్లో లోపించిన జవాబుదారితనం, సిబ్బంది ఇష్టారా జ్యం, అన్ని విభాగాల్లోనూ అవినీతిదే ఆధిపత్యం.. వెరసి నగరపాలకసంస్థలో పరిపాలన గాడి తప్పింది. నగరపాలకసంస్థ విస్తరించినా పౌరసేవలకు మాత్రం నగర ప్రజలు నోచుకోవడం లేదు. ఏ పని కావాలన్నా, ఏ ఫైల్ కదలాలన్నా, చేతి చమురు వదిల్చుకోవాల్సిందే. పనుల కోసం వచ్చే ప్రజలతో అధికారులు ప్రవర్తించే తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. నగరం, నగరపాలకసంస్థ పరిపాలనపై పూర్తి అవగాహన ఉన్న ప్రఫుల్ దేశాయ్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడంతో బల్దియా తీరుమారుతుందేమోననే ఆశతో నగరవాసులున్నారు.
టౌన్‌ప్లానింగ్: మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేది పట్టణ ప్రణాళిక విభాగమే(టౌన్‌ప్లానింగ్). ఒకరిద్దరు అధికారుల మూలంగా టౌన్‌ప్లానింగ్ అంటేనే అవినీతి కూపమనే భావన ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో అన్ని పాత్రలు సదరు అధికారులే పోషిస్తున్నారు. ఎక్కడ నిర్మాణం జరిగినా రూ.లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక నిర్మాణాలు వివాదాస్పదమైతే వారి పంట పండినట్లే.
రెవెన్యూ: ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇవ్వడం, కబ్జాలకు ఇంటి నంబర్లతో సాయం చేయడం, అసెస్మ్‌ంట్లలో చేతివాటం ప్రదర్శించడం లాంటి ఎన్నో ఘనతలు ఉన్న రెవెన్యూ విభాగంలో ప్రతిరోజు ఏదో ఒక వివాదం తప్పడం లేదు. రెండు ఆర్‌వో పోస్టులుంటే, డిప్యుటేషన్‌పై వచ్చిన ముగ్గురిని సర్దుబాటు చేసేందుకు ముగ్గురికి ఆర్‌వో పోస్టులు ఇవ్వడమే ఈ విభాగ పనితీరుకు నిదర్శనం.
ఇంజినీరింగ్: నగర అభివద్ధిలో ప్రధాన పాత్ర పోషించే ఇంజినీరింగ్ విభాగంపై ఆజమాయిషీ లేకుండా పోయింది. కాంట్రాక్టర్లు మనోళ్లైతే చాలు, పనులకు ముందే బిల్లులు తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. అభివద్ధి పనుల్లో నాణ్యత చూడాల్సిన కొంతమంది అధికారులు, పర్సంటేజీలు చూసి బిల్లులు చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. అభివద్ధి పనుల టెండర్, నాణ్యతలపై ఫిర్యాదులున్నా, కాంట్రాక్టర్ చెబితే చాలు ఆగమేఘాలమీద రన్నింగ్ బిల్లుల పేరిట డబ్బులు చెల్లించడం ఇంజినీరింగ్ స్పెషల్.
శానిటేషన్: నగరంలో పారిశుధ్యం (శానిటేషన్)పై ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రోడ్లు, వీధులు, డ్రైనేజీలు ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలుగా దర్శనమిస్తోంది. చివరకు చెత్త డబ్బాల వద్ద కూడా రోడ్లపై చెత్తను రోజుల తరబడి తొలగించని పరిస్థితి నెలకొంది. ఇక మెడివేస్ట్, జంతు ఎముకలు లాంటి ప్రమాదకర వ్యర్థాలు కూడా పారిశుధ్య సిబ్బంది సహకారంతో డంప్‌యార్డ్‌కు చేరుతున్నాయి. శానిటేషన్ వాహనాలు, అందులో పోస్తున్న డీజిల్‌కు కాకిలెక్కలే ఆధారం.
ప్రక్షాళన చేయాల్సిందే
కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రఫుల్‌దేశాయ్ గతంలో పలుమార్లు ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన తీసుకున్న విప్లవాత్మక చర్యలు అప్పట్లో సంచలనం సష్టించాయి. కలెక్షన్ ఏజెంట్లుగా మారిన ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ల పీఠాలను సమూలంగా మార్చారు. బల్దియా చరిత్రలో మొదటి సారి, పనికి మించి బిల్లులు తీసుకున్న మాధవ కన్‌స్ట్రక్షన్ నుంచి డబ్బులు రికవరీ చేయించారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడంతో, నగరపాలకసంస్థను గాడినపెడతారనే విశ్వాసాన్ని నగరప్రజలు వ్యక్తం చేస్తున్నారు.


