
ట్రాక్టర్ కింద పడి విద్యార్థి దుర్మరణం
ముత్తారం(మంథని): మండలంలోని మైదంబండ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పందుల మహేందర్(15) అనే విద్యార్థి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైర్ కింద పడి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మైదంబండకు చెందిన పందుల మొగిళి, లక్ష్మి దంపతుల చిన్న కొడుకు మహేందర్. ఆదివారం తన చిన్నాన్న పందుల శేఖర్, ట్రాక్టర్ ఓనర్, డ్రైవర్ నిమ్మల కుమార్‌తో కలిసి ధాన్యాన్ని ట్రాక్టర్‌లో నింపుతున్నారు. ట్రాక్టర్‌ను ఎత్తుగడ్డపై పెట్టి ధాన్యం నింపుతుండగా, ట్రాక్టర్ కదలడంతో మహేందర్ ఆపే ప్రయత్నం చేయగా, ఇంజన్ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మహేందర్ పోతారం జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివాడు. ఎస్సై నరేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహేందర్ మృతికి కారణమైన శేఖర్, కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.