నిర్మించారు.. వదిలేశారు! | - | Sakshi
Sakshi News home page

నిర్మించారు.. వదిలేశారు!

May 11 2025 12:06 PM | Updated on May 11 2025 12:06 PM

నిర్మించారు.. వదిలేశారు!

నిర్మించారు.. వదిలేశారు!

● బల్దియాకు పట్టని రూ.కోట్ల భవనాలు ● స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్వహణకు రెండోసారి టెండర్‌ ● గతంలో బిడ్డర్లు రాకపోతే 15 శాతం తగ్గించి రీకాల్‌ ● రెండు దశాబ్దాలుగా నిరుపయోగంగా ఐడీఎస్‌ఎంటీ భవనం ● రూ.కోట్లు పెట్టి నిర్మించినా ఆదాయం లేదు ● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా భవన సముదాయాలు ● అధికారుల ముందు చూపు లోపమే కారణమా?

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌ :

ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చే యడం, బతికున్న వారికి డెత్‌సర్టిిఫికెట్‌ జారీ చేయ డం, చనిపోయిన వారికి ఇళ్లు కట్టబెట్టడం, ఎంబీ బుక్కులు మాయం చేయడం, జెండర్‌ మార్చి పింఛన్లు జారీ చేయడం, టెండర్ల అంచనాలు పెంచడం, ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీళ్లు అమ్ముకోవడం, ట్రేడ్‌ లైసెన్సుల్లో చేతివాటం, శ్మశానవాటికల్లో గడ్డిపీకే డబ్బులు జేబులో వేసుకోవడం తదితర అక్రమాల్లో ముందుండే బల్దియా అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రూ.కోట్లు పెట్టి నిర్మించిన సొంతశాఖ భవనాలను ఎలా వినియోగించుకోవాలో తెలియకపోవడం గమనార్హం. మార్కెట్‌లో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్మించకపోవడం,ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలన్న ఆలోచనలు అధికారులకు రాకపోవడం కరీంనగర్‌ ప్రజలకు శాపంగా మారింది.

స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌..

కరీంనగర్‌ స్మార్ట్‌సిటీలో భాగంగా అంబేద్కర్‌ స్టేడి యం ఆవరణలో రూ.26 కోట్ల నిధులతో పలు అభివద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో రూ.16 కోట్లు వెచ్చించి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు. నిర్వహణకు ఇటీవల టెండర్లు పిలిచారు. బల్దియా కోరిన మొత్తం చూసిన బిడ్డర్లు బెంబేలెత్తి ముందుకు రాలేకపోయారు. దీంతో మరోసారి 15శాతం అంచనాలు తగ్గించి టెండర్‌ రీకాల్‌ చేశారు. ప్రస్తుతం నిర్వహణ టెండర్‌ను రూ.కోటి ఏడు లక్షలుగా నిర్ణయించారు. ఇందులో విశాలమైన పార్కింగ్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌లో 22 షాపులతో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో 7447 చదరపు అడుగుల స్పేస్‌ అందుబాటులో ఉంది. విశాలమైన హాల్‌, ప్యాంట్రీ, స్టోర్‌రూం, కిచెన్‌, స్టోర్‌, టాయిలెట్లు, ఫ్యాన్లు, ఏసీలతో కలిపి 9,053 చదరపు అడుగుల స్పేస్‌ అందుబాటులో ఉంది. రెండో అంతస్తులో బాలికలు, బాలురకు ప్రత్యేక డార్మిటరీ, గదులు, స్టోర్‌ రూం, టాయిలెట్లు, ఏసీలు, ఫ్యాన్లు తదితరాలతో కలిపి 8,278 చదరపు అడుగల స్పేస్‌ ఉంది. ఈ సారి కూడా బిడ్డర్ల నుంచి ఆశించిన మేర స్పందన ఉంటుందో లేదో వేచి చూడాలి.

ఐడీఎస్‌ఎంటీ భవనం సైతం..

2006లో ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ స్మాల్‌ అండ్‌ మీడియం టౌన్స్‌ (ఐడీఎస్‌ఎంటీ) పథకంలో భాగంగా మార్కెట్‌లోని శ్రీవెంకటేశ్వర ఆలయం సమీపంలో నిర్మించిన ఐడీఎస్‌ఎంటీ భవనం నేటికీ నిరుపయోగంగానే ఉంది. రెండు దశాబ్దాలుగా ఈ భవనం నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడం వసతుల కల్పనలో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. 2006–07లోనే రూ.4 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ సముదాయానికి 2017లో టెండర్‌ పిలిచినప్పుడు పలువురు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. కానీ, లిఫ్ట్‌, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలంటే.. మీరే పెట్టించుకోండి అని బల్దియా అధికారులు ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప.. బిడ్డర్లు అడిగిన దిశగా ఆలోచనలు చేయలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భవనంలో రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలు జరుగతున్నాయంటే.. అది బల్ది యా అధికారుల నిర్లక్ష్యపు పుణ్యమే. వీటితోపాటు చైతన్యపురి మీసేవా అంతస్తులోని మొదటి అంతస్తు, కశ్మీర్‌ గడ్డ మీసేవాలో మున్సిపల్‌ బిల్డింగ్‌ నిరుపయోగంగా ఉన్నాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి.

సద్వినియోగ పరుస్తాం

స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు గతంలో టెండర్లు పిలిచినపుడు రాకపోవడంతో 15శాతం తగ్గించి టెండర్‌ రీకాల్‌ చేశాం. ప్రస్తుతానికి బిడ్డర్ల నుంచి సానుకూల స్పందన ఆశిస్తున్నాం. ఇక ఐడీఎస్‌ఎంటీ భవనంలో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసి, కొన్ని ప్రాంతాల్లో రీమోడలింగ్‌ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ఇటీవల కలెక్టర్‌తోనూ చర్చించాం. త్వరలోనే రీమోడలింగ్‌ చేసి టెండర్‌ పిలుస్తాం.

– చాహత్‌ బాజ్‌పేయ్‌, ఎంసీకే కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement