
కూలీ పనిచేస్తూ.. కొడుకును చదివిస్తూ..
కథలాపూర్(వేములవాడ): పిల్లలకు తల్లిదండ్రులు అన్ని వసతులు సమకూర్చి చదవాలని చెబితే కొందరు పెడచెవిన పెట్టి వదిలేస్తున్న రోజులివి. కానీ చిన్నప్పటి నుంచి తండ్రి దూరమైనా తల్లి కూలీ పనిచేస్తూ కొడుకును ఇంజినీరింగ్ చదివిస్తోంది. కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన సదుల జలకు రంజిత్ సంతానం. రంజిత్ చిన్నగా ఉన్నప్పుడే జలను ఆమె భర్త విడిచి వెళ్లిపోయాడు. అయినా ఆమె కుంగిపోకుండా ఒకగానొక్క కుమారుడిని ప్రయోజకుడిగా చేయాలనుకుంది. కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. రంజిత్‌ను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి, కథలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసి టాపర్ స్థానం దక్కించుకున్నాడు. ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించి హైదరాబాద్‌లోని కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం పూర్తి చేశాడు. రెక్కాడితేనే డొక్కాడే నిరుపేద కుటుంబానికి చెందిన జల తన కుమారుడిని ఉన్నత చదువులు చదివించడంతో ఆమె కష్టపడిన తీరును అభినందిస్తున్నారు. అమ్మ తన కోసం పడిన శ్రమను చూసి ఉన్నత చదువుల్లో రాణించాలన్నదే లక్ష్యమని రంజిత్ పేర్కొన్నాడు.