
ఎన్టీపీసీ ప్రాజెక్టుకు భారీ బందోబస్తు
జ్యోతినగర్(రామగుండం): పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడుల నేపథ్యంలో ఎన్టీపీసీ ప్రాజెక్టు వద్ద భారీ భద్రత చేపట్టామని సీఐఎస్‌ఎఫ్ సీనియర్ కమాండెంట్ అరవిందకుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో బందోబస్తు చేపట్టారని, ఇందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రామగుండం ఎన్టీపీసీలోనూ హైఅలర్ట్ ప్రకటించామన్నారు. ఇప్పటికే ఉన్న కేంద్ర పారిశ్రామిక భద్రతా(సీఐఎస్‌ఎఫ్) దళానికి తోడు మరిన్ని బలగాలను మోహరించామని అన్నారు. ప్రాజెక్టును పరిరక్షించడం, అత్యంత భద్రత కల్పించడం లక్ష్యంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం, అదనపు ఆయుధాలు సమకూర్చుకోవడం, డ్రోన్ దాడులను ఎదుర్కోవడం, విపత్తులకు ప్రతిస్పందించడం వంటి ముప్పులకు సిద్ధం కావడానికి కేంద్ర పోలీసు దళం మాక్‌డ్రిల్ నిర్వహిస్తోందని వివరించారు. ప్రాజెక్టు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను అంకితభావంతో ఉన్న అధికారులు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. క్షుణ్ణంగా తనిఖీలు చేశాక కదలికలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పరిసరాల్లో నిఘాను కొనసాగించడానికి 24 గంటలపాటు వాహన గస్తీ నిర్వహించడంతోపాటు విజిలెన్స్ బృందాలు వివిధ వనరుల నుంచి చురుకుగా సమాచారం సేకరిస్తున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలతో నిరంతరం కమ్యూనికేషన్ విధానాన్ని అనుసరిస్తూ భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు ఆయన వివరించారు.
మోహరించిన సీఐఎస్‌ఎఫ్ బలగాలు
సీనియర్ కమాండెంట్ అరవింద్‌కుమార్ వెల్లడి