
భూప్రకంపన.. గాలివాన
● భయం గుప్పిట ప్రజలు
కరీంనగర్‌అర్బన్/కరీంనగర్‌రూరల్/గంగాధర/శంకరపట్నం/మానకొండూర్/గన్నేరువరం: ఓ వైపు భూ ప్రకంపన.. మరోవైపు గాలివాన తీవ్ర భయాందోళనకు గురి చేసింది. సోమవారం సాయంత్రం 6.49 నుంచి 6.55 గంటల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 3.9గా నమోదైంది. జిల్లాకేంద్రంలో రెండుసార్లు భూకంపం రాగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. కరీంనగర్, హుజూరాబాద్, గంగాధర, కొత్తపల్లి ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు తమ వారి యోగక్షేమాలను తెలుసుకునేందుకు ఫోన్లను ఆశ్రయించారు. కొద్దిసేపు భవనాలకు దూరంగా ఉన్న ప్రజలు మళ్లీ యథాస్థితిని కొనసాగించారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్, చామనపల్లి తదితర గ్రామాల్లో రెండు పర్యాయాలు భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దుర్శేడ్‌లోని ఓ కిరాణ దుకాణంలో భూకంపం ధాటికి రిఫ్రిజిరేటర్‌తోపాటు భవనం కదిలిన దృశ్యం సీసీ కెమెరాలో నమోదైంది. గన్నేరువరం మండలంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అంతలోనే గాలివాన..
భూప్రకంపనలతో జనం భయభ్రాంతులకు గురికాగా, అంతలోనే గాలివాన బీభత్సంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో గల శ్రీచైతన్య కాలేజీ భవన రేకులు వెనుకాల ఇంటిపై పడగా పాక్షిక నష్టం వాటిల్లింది. గంగాధర మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసింది. శంకరపట్నం మండలం ఆముదాలపల్లిలో రాళ్లవాన కురిసి, తాటిచెట్టుపై పిడుగు పడింది. కేశవపట్నంలో విద్యుత్ స్తంభంపై చెట్టు విరిగిపడి, తీగలు తెగిపోవడంతో సరాఫరా నిలిచిపోయింది. తాడికల్–వంకాయగూడెం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడగా, వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. మానకొండూర్ మండలం కొండపల్కల, కెల్లెడ తదితర గ్రామాల్లో వడగండ్లు కురిశాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. మామిడి తోటల్లో కాయలు నేలరాలి రైతులకు నష్టం వాటిల్లింది. గంగిపల్లి, కొండపల్కలలో విద్యుత్ స్తంభాలు విరిగిపడి అంధకారం నెలకొంది.
జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా గాలిదుమారంతో పాటు వాన కురవడంతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు చినిగిపోయాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్

భూప్రకంపన.. గాలివాన