
డంప్‌యార్డ్‌కు చెత్త తగ్గించాలి
● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్
కరీంనగర్‌కార్పొరేషన్: ఇంట్లో ఉత్పత్తి అయిన చెత్తను వేరు చేసి డిస్పోజ్ చేయడం ద్వారా డంప్‌యార్డ్‌కు చెత్తను తగ్గించాలని నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా సోమవారం నగరంలోని భగత్‌నగర్, విద్యానగర్ ప్రాంతాల్లోని పలు అపార్ట్‌మెంట్లలో తడి, పొడి చెత్త వేరు చేయడం, డిస్పోజ్ చేయడంపై అవగాహన కల్పించారు. తడి చెత్త ద్వారా కంపోస్టు ఎరువులు తయారు చేస్తున్నామని, పొడి చెత్తను డీఆర్‌సీ సెంటర్‌కు తరలిస్తున్నామని పేర్కొన్నారు. డంప్‌యార్డ్ పరిసర ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కొత్తగా ఉత్పత్తి అయ్యే చెత్త భారిగా డంపు యార్డుకు తరలివెళ్లడం ద్వారా బయోమైనింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుందన్నారు.
స్థలం దొరకగానే డంప్‌యార్డ్ తరలింపు
ఇతర ప్రాంతంలో స్థలం దొరకగానే డంప్‌యార్డ్‌ను ఆటోనగర్ నుంచి తరలిస్తామని కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ అన్నారు. సోమవారం డంప్‌యార్డ్ బాధితులతో తన చాంబర్‌లో సమావేశమయ్యారు. డంప్‌యార్డ్ కోసం హుజురాబాద్ ప్రాంతంలో స్థలం కేటాయింపునకు సంబంధించిన ప్రతిపాదన ఉందన్నారు. రోజూ అధికంగా వస్తున్న చెత్త కారణంగా బయోమైనింగ్‌లో జాప్యం జరుగుతుందున్నారు.