
మామిడి మార్కెట్‌తో ఉపాధి
● పొరుగు రాష్ట్రాల నుంచి కూలీల రాక
● వసతులు కల్పించడంలో వ్యాపారుల నిర్లక్ష్యం
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాలలోని చల్‌గల్ మామిడి మార్కెట్ కూలీలకు ఉపాధి మార్గంగా మారింది. ఈ మార్కెట్‌లో మామిడి సీజన్‌లో పనిచేసేందుకు స్థానిక కూలీలేకాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి వస్తుంటారు. వేల సంఖ్యలో కూలీలు వస్తున్నప్పటికీ వారితో పనిచేయించుకునే వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ పట్టించుకోకపోవడంతో వారికి కనీస వసతులు కరువయ్యాయి.
వేల సంఖ్యలో కూలీలు
మామిడి సీజన్ ఏప్రిల్, మే నెలల్లో కొనసాగుతుంది. ఈ సీజన్‌లో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో రోడ్ల వెంబడి వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకుని రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేస్తుంటారు. వాటిని ట్రాక్టర్ల నుంచి దింపేందుకు.. కాయలను గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసేందుకు.. లారీల్లో లోడ్ చేసేందుకు ఎక్కువ సంఖ్యలో కూలీలు అవసరమవుతారు. తోటల్లో కాయలు తెంపేందుకు కూడా కూలీల అవసరం ఎక్కువ. ఈ పనులు చేసేందుకు స్థానికంగా కూలీలు దొరక్కపోవడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూలీలను రప్పిస్తుంటారు. ఒక్కో వ్యాపారి దుకాణంలో కనీసం 50 మంది వరకు కూలీలు పనిచేస్తుంటారు.
నెలరోజుల్లో రూ.25వేల నుంచి రూ.30వేల ఆదాయం
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలను వ్యాపారులు వివిధ పనులకు ఉపయోగించుకుంటారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కూలీలను మామిడి కాయలను తెంపేందుకు, లోడింగ్, అన్‌లోడింగ్ చేసేందుకు ఉపయోగిస్తారు. ఢిల్లీ, రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలను మామిడికాయల గ్రేడింగ్.. ప్యాకింగ్‌కు ఉపయోగిస్తారు. కూలీలు గ్రూపుగా ఏర్పడి పనులు చేస్తుండటంతో టన్ను ఆన్‌లోడ్ చేస్తే రూ.250 వరకు చెల్లిస్తారు. గ్రేడింగ్.. ప్యాకింగ్ చేసే వారికి ట్రేకు రూ.15, పెట్టెలను లారీల్లో లోడ్ చేస్తే రూ.3వేల నుంచి రూ.5 వేలు, కాయలు తెంపడానికి వెళ్తే రోజుకు రూ.500 చెల్లిస్తారు. ఆ వ్యాపారి దుకాణానికి వచ్చిన కాయలను బట్టి ఒక్కో కూలీ కనీసం 30నుంచి40 రోజుల్లో రూ.30వేల నుంచి రూ.50 వేలు సంపాదించుకుంటారు. ఆయా రాష్ట్రాల్లో వేసవి సీజన్‌లో పనులు లేకపోవడంతో పనుల కోసం జగిత్యాల వస్తుంటారు. ఇలా జిల్లాకు కనీసం ఐదారు వేల మంది కూలీలు వస్తుంటారు.
వసతులు అంతంతే..
మార్కెట్లో కూలీలతో పనులు చేయించేందుకు చూపుతున్న శ్రద్ధ.. వారికి కనీస వసతులు కల్పించడంతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మండుతున్న ఎండలో మార్కెట్ పక్కనున్న వ్యవసాయ భూముల్లో ప్లాస్టిక్ కవర్లతో గుడారాలు వేసుకుని ఉండటం.. షెడ్ల కింద పడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరుగుదొడ్ల వసతి లేకపోవడంతో వారి బాధలు వర్ణణాతీతం. చాలామంది రోడ్డపక్కనున్న చెట్ల కింద తీరుతున్నారు. ఈ క్రమంలో వారిని పనులకు తీసుకొస్తున్న వ్యాపారులు వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని స్థానికులు అంటున్నారు.
ఏటా వస్తుంటాం
ఏటా మామిడి సీజన్‌లో జగిత్యాలకు వస్తుంటాం. నెల రోజులపాటు ఇక్కడ పనిచేస్తాం. రూ.30వేల వరకు సంపాదించుకుంటాం. మహారాష్ట్రలో పనులు లేకపోవడంతో ఉపాధి కోసం ఇక్కడకు వస్తాం.
– సేవాలాల్, మహారాష్ట్ర
ప్యాకింగ్ చేస్తాం
మామిడికాయలను గ్రేడింగ్ చేసి, ప్యాకింగ్ చేసేందుకు ఇక్కడకు వస్తాం. మా రాష్ట్రం నుండి కనీసం 500 మంది వరకు వచ్చాం. మామిడి మార్కెట్లో ఏదో పని దొరుకుతుందనే ఆశతో వచ్చి, ఎంతో కొంత సంపాదించుకుని వెళ్లతాం. – గుడ్డె, ఉత్తరప్రదేశ్

మామిడి మార్కెట్‌తో ఉపాధి

మామిడి మార్కెట్‌తో ఉపాధి

మామిడి మార్కెట్‌తో ఉపాధి