కరీంనగర్ క్రైం: అదనపు వరకట్నం కోసం అత్తింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆమె భర్త, అత్తామామ, ఆడబిడ్డ, ఆడబిడ్డ భర్తకు ఏడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి బి.ప్రతిమ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తిమ్మాపూర్ మండలంలోని నేదునూరు గ్రామానికి చెందిన స్వరూప(33)కు కేశవపట్నం మండలంలోని కరీంపేటకు చెందిన బొజ్జ కుమార్‌తో 2015లో పెళ్లి జరిపించారు. వివాహం తర్వాత మూడేళ్లు కలహాలు లేకుండా కలిసున్నారు. ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు. ఈ క్రమంలో భర్త కుమార్, అత్త ఐలమ్మ, మామ కొమురయ్య, ఆడబిడ్డ మెరుగు విజయ, ఆమె భర్త కుమారస్వామిలు స్వరూపను అదనపు వరకట్నం కోసం కొట్టి, తిట్టి, ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దీంతో ఆమె నేదునూరులోని తన అన్న ఇంటి వద్ద బాబుతో కలిసి ఉంటోంది.
రూ.2 లక్షలిచ్చి, కాపురానికి పంపమన్నారు..
స్వరూప అన్న కవ్వంపల్లి రవి కుటుంబసభ్యులతో కరీంపేట వెళ్లి, చిన్న బాబును చూసైనా తన చెల్లెలితో కలిసి కాపురం చేయాలని, కుమార్‌తోపాటు అతని కుటుంబ సభ్యులను బతిమిలాడాడు. కానీ వారు అదనపు కట్నం రూ.2 లక్షలు ఇచ్చి, కాపురానికి పంపాలని తేల్చిచెప్పారు. అంత డబ్బు వారి వద్ద లేకపోవడంతో తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా కుమార్ తన భార్య సరూపకు ఫోన్ చేసి, కట్నం తీసుకొని రా లేకుంటే అక్కడే చచ్చిపో అని తరచూ వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె 2019 మార్చి 16న ఉదయం బాత్రూంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని, నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించగా మెజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చి, చనిపోయింది. ఈ సంఘటనపై మృతురాలి అన్న రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్‌ఎండీ పోలీసులు కేసు నమోదు చేయగా అప్పటి ట్రైనీ ఏసీపీ ఉషారాణి దర్యాప్తు చేశారు. సీఎంఎస్ ఏఎస్‌ఐ తిరుపతి పర్యవేక్షణలో పీసీ శంకర్ సాక్షులను కోర్టులో హాజరుపర్చగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి ప్రతిమ బొజ్జ కుమార్, ఐలమ్మ, కొమురయ్యలకు ఏడేళ్ల జైలుశిక్ష, రూ. 17 వేల చొప్పున జరిమానా, మెరుగు విజయ, కుమారస్వామిలకు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు.