
సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్రాములు
కరీంనగర్: ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీరని అన్యాయానికి గురవుతున్న బీసీలు రాజ్యాధికారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో నిర్వహించిన సమితి జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి, 75 ఏళ్లయినా సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వివక్షకు గురవడం సిగ్గుచేటన్నారు. దేశంలో బీసీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమాలు జరుగుతున్నా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించాలని కోరారు. బీసీ బంధు పథకం తీసుకువచ్చి, ప్రతీ బీసీ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలన్నారు. నాయకులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, పైడిపల్లి రాజు, ఎస్.కొమురయ్య, జక్కుల ఆగయ్య, పున్నం శ్రీకాంత్, చిగుర్ల కొమురయ్య, ఎ.సాయికిరణ్, పల్లె యాదగిరి, జక్కుల రాములు, కె.వెంకటేశం, పి.సంపత్ తదితరులు పాల్గొన్నారు.