అరైవ్‌ అలైవ్‌తో మార్పు | - | Sakshi
Sakshi News home page

అరైవ్‌ అలైవ్‌తో మార్పు

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

అరైవ్‌ అలైవ్‌తో మార్పు

డీజీపీకి ఘన స్వాగతం

తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు

అందరూ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి

డీజీపీ శివధర్‌రెడ్డి

కామారెడ్డి క్రైం: ‘అరైవ్‌ –అలైవ్‌’తో మార్పు కనిపిస్తోందని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డిలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన అరైవ్‌–అలైవ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను ఎస్పీ రాజేశ్‌ చంద్ర పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏటా రోడ్డు ప్రమాదాల్లో 7,500 మందికిపైగా చనిపోతున్నారన్నారు. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ పెట్టుకోకపోవడం, డ్రంకెన్‌ డ్రైవ్‌, రాంగ్‌రూట్‌, అతివేగంలాంటి కారణాలతోనే ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం అరైవ్‌–అలైవ్‌ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ కార్యక్రమం అమలు చేశాక ప్రమాదాలు తగ్గాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాలలో 330 మరణాలు తక్కువగా నమోదయ్యాయన్నారు. ఈ లెక్కన ఏడాదిలో 1200 లకుపైగా మరణాలను తగ్గించే అవకాశం ఉందన్నారు.

కుటుంబమే రోడ్డున పడుతుంది

ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతే అతడి కుటుంబం మొత్తం రోడ్డున పడినట్లే అవుతుందని డీజీపీ పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రాంతంలో ఇటీవల ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతే కుటుంబ పోషణ భారమై అతడి భార్య తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ డిఫెన్సివ్‌ డ్రైవింగ్‌ను అలవర్చుకోవాలని సూచించారు. తప్పనిసరిగా హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ పెట్టుకోవాలన్నారు.

ప్రతినెలా సమీక్షిస్తున్నాం

ప్రతి నెలా జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరుపుతున్నామని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. సర్పంచ్‌లు సైతం ప్రమాదాల నివారణ, ట్రాఫిక్‌ రూల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర వహించాలని కోరారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు కామారెడ్డిలోని సాందీపని కళాశాల విద్యార్థులు రోడ్డు ప్రమాదాలతో కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాప్రదర్శనలు ఇచ్చారు. డీజీపీ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ రాజేశ్‌ చంద్ర, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఎఫ్‌వో నిఖిత, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఉమారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, డ్రైవర్లు పాల్గొన్నారు.

కామారెడ్డి క్రైం: జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్‌రెడ్డికి జిల్లా పోలీసు కార్యాలయం వద్ద కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, ఎస్పీ రాజేశ్‌ చంద్ర పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. జిల్లా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన కార్యాలయంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement