నవీపేట: మండలంలోని నాళేశ్వర్ శివారులోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడి నీటమునిగి మృతిచెందాడు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇలా.. మాక్లూర్ మండలం ముత్యంపల్లికి చెందిన పెరిగె చిన్నసాయిలు(51) శుక్రవారం నందిపేట మండలం తల్వెదలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లాడు. అనంతరం అదేరోజు రాత్రి అతడు నాళేశ్వర్‌లోని బంధువు ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం చిన్నసాయిలు కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి, తిరిగి రాలేడు. నాళేశ్వర్ శివారులోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో చిన్నసాయిలు మృతదేహం కనిపించింది. మృతుడి కుమారుడు సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బాల్కొండ: మెండోరా మండలం దూదిగాం గ్రామంలో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మెండోరా ఎస్సై సుహాసిని తెలిపిన వివరాలు ఇలా.. దూదిగాం వద్దగల జాతీయ రహదారి 44 సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్, బెల్ట్ ధరించి ఉన్నాడన్నారు. తెల్లటి గడ్డం ఉందన్నారు. ఆచూకి తెలిసిన వారు మెండోరా పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసుకుని శవాన్ని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
క్రైం కార్నర్


