మూడు ఆలయాల్లో చోరీ
మోపాల్: మండలంలోని సిర్‌పూర్ తండా, గుడి తండాలోని సేవాలాల్ ఆలయాల్లో, నర్సింగ్‌పల్లిలోని పెద్దమ్మ గుడిలో చోరీ జరిగినట్లు ఎస్‌ఐ సుస్మిత శనివారం తెలిపారు. గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి సిర్‌పూర్ తండాలోని సేవాలాల్ ఆలయం తాళాలు ధ్వంసం చేసి, విగ్రహాలపై ఉన్న తులం బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అదేవిధంగా నర్సింగ్‌పల్లిలోని పెద్దమ్మ గుడిలో తులం బంగారు పుస్తెలు, గుడి తండాలోని సేవాలాల్ మహారాజ్ గుడిలో బంగారు ముక్కుపుడక, పుస్తకం, ఇతర బంగారు ఆభరణాలు కలిపి తులం వరకు చోరీకి పాల్పడ్డారు. మరుసటి రోజు స్థానికులు చోరీలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలాలను పరిశీలించి, వివరాలు సేకరించారు. మూడు ఆలయాల్లో కలిపి సుమారు మూడు తులాలకుపైగా బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సుస్మిత తెలిపారు.


