విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో శనివారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఉదయం పాఠశాల స్థాయి విద్యార్థులకు ‘ఉగ్రవాదం పై భారత్ పోరు‘ అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. పైస్థాయి విద్యార్థులకు మధ్యాహ్నం ‘ప్రజాస్వామ్యం, ఎన్నికలు యువత‘ అనే అంశంపై ఉపన్యాస పోటీ నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రొఫెసర్ కుమారస్వామి, రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్ వీర ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ భుజంగం, లెక్చరర్ రాజేంద్రప్రసాద్ ఉన్నారు. డిప్యూటీ లైబ్రేరియన్ రాజిరెడ్డి, అసిస్టెంట్ లైబ్రేరియన్ తారకం తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతుంది. ప్రస్తుతం 9454 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 8వేల క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులుతో నిండుకుండలా ఉంది.
36.35 మెగావాట్ల విద్యుదుత్పత్తి..
ప్రాజెక్ట్ నుంచి ఎస్కెప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండటంతో స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలో నాలుగు టర్బయిన్‌ల ద్వారా 36.35 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 78.8 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని జెన్‌కో అధికారులు తెలిపారు.
● 32 మందికి జరిమానా
నిజామాబాద్‌అర్బన్: నగరంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, మద్యం తాగి వాహనాలు నడుపుతూ 40మంది పట్టుబడ్డారు. వారికి శనివారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ కౌన్సెలింగ్ నిర్వహించి, అనంతరం నగరంలోని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. జడ్జి వారిలో 32 మందికి రూ. 10,000 చొప్పున జరిమానా విధించగా, 8 మందికి వారం రోజుల పాటు జైలుశిక్ష విధించారు.


