తగ్గుతున్న భూసారం
వరి కొయ్యలను కాల్చొద్దు
లింగంపేట(ఎల్లారెడ్డి): రైతులు పండించిన వరి పంట నూర్పిళ్లు చేసిన పది, పదిహేను రోజులకు వరి కొయ్య కాళ్లకు నిప్పు పెట్టి కాల్చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ ఏటా ఇలా చేయడం వల్ల చేనులో భూసారం తగ్గిపోయి దిగుబడి తగ్గిపోతోంది. కొయ్యలను కాల్చడం వల్ల భూసారం క్షీణించడం, పొలంలోని సేంద్రియ పదార్థం, పోషకాలు, సూక్ష్మజీవులు, మిత్ర పురుగులు నశించిపోతాయి. రైతులు నష్టపోకుండా ఉండాలంటే నూర్పిళ్లు చేసిన అనంతరం యంత్రం ద్వారా వచ్చిన గడ్డిని కట్టలు కట్టించాలి. రెండు, మూడు రోజుల్లో పొలం కలియదున్నాలి. దాంతో వరి నాట్లు వేసేవరకు భూమి లోపలికి గాలి ప్రవేశించి భూసారం పెరుగుతుంది. వరి కొయ్యలు సైతం మట్టిలో కుళ్లిపోయి సేంద్రీయ ఎరువుగా మారుతుంది. ఇది కలుపు మొక్కలను తగ్గించి, మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడుతుంది. వరి కొయ్యలను కాల్చకుండా వాటిని భూమిలో కలపడం చాలా శ్రేయస్కరం. నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొలంలో కలిపిన కొయ్యలు కుళ్లిపోయి నేలలో సారం పెంచుతుంది. నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతీ ఏటా పంటల మార్పిడి చేయడం వల్ల భూసారం పెంచుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పంటల మార్పిడితో దిగుబడులు సైతం పెరుగుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
కలుపు మొక్కలు తగ్గుతాయి..
వరి కొయ్యలు కుళ్లిపోవడం వల్ల కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతుంది.నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.నేల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మొ క్క వేళ్లు ఆరోగ్యంగా పెరిగి, అధిక దిగుబడి వస్తుంది. వరి కొయ్యలు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి.వరి పొట్టు కార్బన్‌కు మూలం. ఇది నేల లో నీటిని,పోషకాలను నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.వరి పొట్టును మల్చ్‌గా ఉపయోగించడం వల్ల కలుపు మొక్కల పెరుగుదలను తగ్గిస్తుంది.
పెరుగుతున్న వాతావరణ కాలుష్యం..
వరి కొయ్యలు కాల్చినప్పుడు వచ్చే పొగ, బూడిద వాతావరణ కాలుష్యాన్ని పెంచుతోంది. దీనివల్ల రైతులకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే పంట దిగుబడి తగ్గుతుంది. కొయ్యలు కాల్చడం వల్ల భూమి పైపొర గట్టిపడి, మట్టిని దున్నడం కష్టమవుతుంది. అలాగే నీరు భూమిలోకి ఇంకే సామర్థ్యం తగ్గిపోతుంది.
రైతులు వరి పంటలను నూ ర్పి ళ్లు చేసిన తర్వాత కొయ్యలను కాల్చవద్దు. రైతులకు ‘రై తు నేస్తం’ కార్యక్రమం ద్వారా కొ య్యలు కాల్చవద్దని అవగాహ న కల్పిస్తున్నాం. ఖరీఫ్, యాసంగిలో ఒకే పంట వే యడం వల్ల దిగుబడి తగ్గుతుంది. పంటల మార్పిడి పద్ధతులు పాటిస్తే మేలు. కాలుష్యాన్ని నివారించడానికి కొయ్యలకు నిప్పు పెట్టడం నిలిపివేయాలి.
– అనిల్‌కుమార్, ఏవో, లింగంపేట
వరి కొయ్యలను తగులబెట్టడంతో దిగుబడిపై ప్రభావం
పెరుగుతున్న కాలుష్యంతో రోగాల బారిన పడుతున్న రైతులు
పంటల మార్పిడి అవసరమంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు
తగ్గుతున్న భూసారం


