అక్రమంగా మొరం తవ్వకాలు
చర్యలు తీసుకుంటాం
కామారెడ్డి రూరల్ : ఎలాంటి అనుమతులు లేకుండా అసైన్డ్ భూముల్లో రాత్రి వేళల్లో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్నారు. శాబ్దిపూర్ శివారులోని గూడెం రోడ్డు పక్కన గల అసైన్డ్ భూమి సర్వే నంబర్–38లో నుంచి రెండేళ్లుగా యథేచ్ఛగా మొరం తరలిస్తున్నారు. ప్రభుత్వ భూములు అమ్మ వద్దు, కొనరాదు అనే నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి ఓ నాయకుడు రెండెకరాలు కొనుగోలు చేసి అందులో నుంచి రెండు సంవత్సరాలుగా టిప్పర్లతో మట్టి, మొరం తరలిస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అధిక లోడ్ టిప్పర్లతో మొరం తరలించడం వల్ల గ్రామంలో వేసిన రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయని పేర్కొన్నారు. మట్టి తరలింపు, భూమి కొనుగోలు, రోడ్ల ధ్వంసం విషయాలపై మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల సహకారంతోనే ఆ వ్యక్తి రాత్రింబవళ్లు మొరం తరలిస్తున్నాడని ఆరోపించారు. నిత్యం మట్టిని తవ్వుతూ టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయన్నారు. ఖనిజ సంపద తరలిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం.
మొరం తవ్వకాలు తమ దృష్టికి రాలేదు. శాబ్దిపూర్ శివారులోని సర్వే నెంబర్–38లో గల అసైన్డ్ భూమిలో నుంచి అక్రమంగా మట్టి, మొరం రవాణాను ఉపేక్షించం. మొరం తవ్వుతున్న వాహనాలతో పాటు తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేస్తాం. వెంటనే ఆర్‌ఐని పంపించి వాహనాలను సీజ్ చేస్తాం.
–జనార్దన్, తహసీల్దార్, కామారెడ్డి
అసైన్డ్ భూముల్లో తవ్వి రాత్రి
వేళల్లో తరలింపు
రూ.లక్షలు గడిస్తున్న వ్యాపారులు
చోద్యం చూస్తున్న రెవెన్యూ,
మైనింగ్ అధికారులు


